యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ రాజకీయాలు ఫిరాయింపులతో వేడెక్కాయి. అనూహ్యంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు మొదలవడంతో ఇప్పటివరకు గంభీరంగా ఉన్న టీడీపీలో కొంత టెన్షన్ మొదలైంది. అయితే.. ఈ ఫిరాయింపులవల్ల ఎలాంటి నష్టం లేదని.. తెలుగు పాలిటిక్సులో లేటెస్టు రిజల్ట్స్ ఆధారంగా చూసుకుంటే ఇవి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి మంచి శకునమేనంటున్నారు.రెండు నెలల కిందట తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు గుర్తుందా.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలూ విపక్షానికి జైకొట్టారు. దీంతో… ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టి కాలమతుల్లా వీరు ఆ గట్టుకు చేరుకున్నారన్న విశ్లేషణలు వినవచ్చాయి. అంతేకాదు… టీఆరెస్ ఓటమి ఖాయమని.. గెలిచినా అతి తక్కువ మెజారిటీతో మాత్రమే బయటపడుతుందని అంతా అనుకున్నారు. అసలు.. టీఆరెస్ శిబిరాల్లోనూ ఈ వలసల కారణంగా వణికిపోయినవారున్నారు. అలాంటిది.. ఫలితాల రోజున అంతా మారిపోయింది. ఒక ప్రభంజనమే కనిపించింది. ఎవరూ ఊహించనన్ని సీట్లు టీఆరెస్ గెలుచుకుంది.ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ప్రచారం జరుగుతున్నా విపక్ష వైసీపీ బలం ఏమంతగా కనిపించడం లేదు. పైగా ఈ వలసలు కూడా తెలంగాణలో మాదిరిగానే కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణలో టీఆరెస్‌కు వలసలు ఎలా శుభంగా మారాయో ఇప్పుడు టీడీపీకి కూడా అలాగే వరంలా మారుతాయంటున్నారు. ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు