యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఫేడ్ అవుట్ లీడర్ గా నిన్న మొన్నటి వరకూ అనుకునే వారు. చంద్రబాబు కూడా దగ్గుబాటిని లైట్ గా తీసుకున్నారు. ఆయనతో దశాబ్దాల కాలం నుంచి ఉన్న పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్న నేతలు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ఉన్నారు. దగ్గుబాటి కుమారుడు హితేష్ రాజకీయ భవితవ్యం కోసం వైసీపీ అధినేత జగన్ తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు సమావేశమయినప్పుడు కూడా చంద్రబాబు లైట్ గా తీసుకున్నారు. కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు జగన్ కు ఒక ఎస్సెట్ అయ్యారనే చెప్పాలి. ప్రధానంగా బలహీనంగా ఉన్న ప్రాంతంలో పట్టున్న నేతలను తీసుకురావడంలో దగ్గుబాటి విరామం ఎరుగకుండా వైసీపీ తరుపున పనిచేస్తున్నారు.నిజానికి దాసరి జై రమేష్ వైసీపీలోకి వస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. ఆర్థికంగా కూడా తెలుగుదేశం పార్టీని విపక్షంలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి. అలాటి దాసరి జై రమేష్ పార్టీలోకి వచ్చేందుకు దగ్గుబాటి ప్రయత్నమే కారణమని చెప్పకతప్పదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దాసరి జై రమేష్ సన్నిహితంగా ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో కలసి పాల్గొనేవారు. దగ్గుబాటి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన దాసరి జై రమేష్ తో సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. ఇప్పుడు విజయవాడ ఎంపీ సీటుకు వైసీపీకి బలమైన అభ్యర్థి దొరకడానికి దగ్గుబాటి మాత్రమేనన్నది వాస్తవం.దగ్గుబాటి వైసీపీకి దగ్గరవ్వడంతోనే చీరాల ఎమ్మల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా వైసీపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపారన్న టాక్ కూడా ఉంది. చీరాలలోనూ దగ్గుబాటి ప్రభావం చూపుతారు. అందుకోసమే ఆయన పార్టీ మారినట్లు చెబుతున్నారు. ప్రధానంగా గుంటూరు, విజయవాడ ఎంపీ అభ్యర్థుల కొరత వైసీపీకి బాగా ఉంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నేతలకే ఏ పార్టీ అయినా టిక్కెట్ కేటాయించాల్సి ఉంది. ఈ రెండు చోట్ల అభ్యర్థుల ఎంపికలో దగ్గుబాటి కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. దాసరి జై రమేష్ చేరికతో విజయవాడ పార్లమెంటు స్థానం ఇప్పుడు దాదాపుగా ఖరారయినట్లే.ఇక గుంటూరు స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై వైసీపీ అధినేత జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక్కడ కూడా ఒక పారిశ్రామికవేత్తను రంగంలోకి దించుతారన్న టాక్ విన్పిస్తుంది. ఆయనను కూడా దగ్గుబాటి త్వరలోనే జగన్ ముందుకు తెస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును గద్దె దించే లక్ష్యంతో ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ తో చేతులు కలిపిన తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మొత్తం మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ కు ఎస్సెట్ అయ్యారని చెప్పకతప్పదు. తెలుగుదేశంలో నుంచి మరి ఎంతమంది నేతలను దగ్గుబాటి తీసుకెళ్తారోనన్న దడ చంద్రబాబు లో ప్రాంరభమయిందంటున్నారు.