యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నూలు జిల్లా రాజకీయం రోజురోజూకు వేడెక్కుతోంది. కోట్ల కుటుంబ టీడీపీలో చేరేందుకు సిద్ధమవ్వడంతో ఒక్కసారిగా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీ తరపున కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖరారైంది. కందనవోలుపై పూర్తి ఆధిపత్యం కలిగిన కోట్ల కుటుంబం ఇక్కడి నుంచి తొమ్మిది సార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ డిపాజిట్లు దక్కకపోయినా సూర్య ప్రకాశ్‌రెడ్డి 1.16లక్షల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలవడం.. కోట్ల కుటుంబంపై ఇక్కడి ప్రజలకు ఉన్న మమకారానికి నిదర్శనం. జిల్లాలో కోట్ల కుటుంబానికి మంచి పేరు ఉండడంతోపాటు వారికంటూ సొంతవర్గం ఉంది. కోట్ల కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ పార్టీలోకి వెళ్లినా వర్గమంతా ఆ కుటుంబం వెన్నంటి ఉంటారు. తెదేపా నుంచి ఆయన విజయం నల్లేరుపై నడకేనని అధికార పార్టీ ధీమా వ్యక్తంచేస్తోంది.మరోపక్క కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని ఎదుర్కొనే దీటైన వ్యక్తి కోసం వైకాపా అన్వేషిస్తోంది. మొన్నటి దాక కోట్ల వైసీపీలో చేరతారని జగన్ రెలాక్ష్ అయ్యారు. కాని కోట్ల జగన్ కు జర్క్ ఇచ్చి, తెలుగుదేశంలో చేరారు. ఈ అనూహ్య పరిణామంతో జగన్ దిక్కుతోచక కూర్చున్నారు.. దీంతో కర్నూలు ఎంపీ టికెట్ బీసీ అభ్యర్థికి ఇస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. బీసీల్లో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపై తర్జనభర్జనలు నడుస్తున్నాయి. వాల్మీకి ఓట్లు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో ఇదే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బీవై రామయ్య టికెట్ ఆశిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి వైసీపీలో చేరారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన బుట్టా రేణుక రాజకీయాలకు కొత్త అయినా.. కింది స్థాయి కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ఆమె విజయానికి కారకులయ్యారు. ఈసారి అదే ఓటు బ్యాంకు తమను గెలిపిస్తుందని వైసీపీ ధీమాగా ఉంది. జిల్లాలో రెండు వర్గాలు ఉన్నచోట్ల కేఈ కుటుంబాలు కలిసి పనిచేస్తే తెదేపా బలం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కర్నూలు సీటుపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన జగన్ కోట్లను ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. కర్నూలులోని ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేత సంజీవ్‌కుమార్ వైకాపా సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంటు అభ్యర్థిని త్వరగా తేల్చేస్తే క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు సమయం దొరుకుతుందని వైకాపా నేతలు భావిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.