యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజంపేట పార్లమెంటు అభ్యర్థిత్వంపై టిడిపి దృష్టి సారించింది. కడప ఎంపీ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో రాజంపేట ఎంపీ అభ్యర్థిని ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. టిడిపి అధిష్టానం చిత్తూరు జిల్లాకు చెందిన డికె శ్రీనివాస్, టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అల్లుడు లోకేష్ ఆశావహుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసిపిలో చేరిన నేపథ్యంలో బలమైన వైసిపి అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే అంశంపై టిడిపి సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం. ముగ్గురు టిడిపి నేతలతో కూడిన త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కావాలనే ఆశావహ అభ్యర్థుల ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను భేరీజు వేసుకునే పనిలో నిమగమైంది. ఈ నెల 28వ తేదీ నాటికి టికెట్లు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలు స్తోంది.కడప పార్లమెంటు అభ్యర్థి ఎంపికపై నెలకొన్న చిక్కుముడి వీడిపోయింది. జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.ఆర్, ఎంపీ అభ్యర్థిగా మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎన్నికల బరిలో నిలవాలని అధిష్టానం తేల్చేసింది. కడప పార్లమెంట్ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో రాజంపేట ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఎవరికి కేటాయిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. ఇటీవల రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసిపిలో చేరిన నేపథ్యంలో అధికార పార్టీకి కడప ఎంపీ అభ్యర్థిత్వ ఎంపికను తలదన్నే తరహాలో చిక్కు సమస్య ఎదురైంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బలమైన నాయకత్వం ప్రతిపక్ష పరం కావడంతో అధికార పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రతిపక్ష వైసిపి అభ్యర్థులకు ధీటైన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయడంపై అధిష్టానం దిక్కులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. రాజంపేట ఎమ్మెల్యే టికెట్‌కు బత్యాల పేరును ప్రచారంలో ఉంచినప్పటికీ, ఆయనకు దన్నుగా నిలిచే నాయకుడిని ఎంపీ బరిలో నిలపాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది.రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోని సామాజిక కోణాలను పరిశీలిస్తే 2.80 లక్షల ఓటర్లతో ముస్లిములు, 2.15 లక్షలు రెడ్లు, 2.05 లక్షలు బలిజ సామాజికవర్గాలు ఉన్నట్లు అంచనా. మూడు సామాజిక వర్గాల్లో ముస్లిము సామాజికవం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వారికి రాజకీయ వారసత్వ కుటుంబాలు లేకపోవడంతో నిరాశనే మిగుల్చుతోంది. ఇది మిగిలిన సామాజిక వర్గాల నేతలకు కలిసి వస్తోంది. ద్వితీయ స్థానంలో ఉన్న రెడ్డి సామాజికవర్గం, దాని వెన్నంటి బలిజ సామాజిక వర్గాలు పరస్పరం పోటీపడుతున్న నేపథ్యంలో టికెట్ల ఎంపికలో జాప్యం జరుగుతోంది. టిడిపి అధిష్టానం చిత్తూరు జిల్లాకు చెందిన మాజీఎంపీ డికె ఆదికేశవులనాయుడు కుమారుడు డికె,శ్రీనివాస్, జిల్లాకు చెందిన టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అల్లుడు లోకేష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల కోణంలో పరిశీలిస్తే బలమైన నేతలెవరనే అంశంపై అధిష్టానం మల్ల గుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీల నాటికి మెజార్టీ అసెంబ్లీ, ఎంపీ టికెట్లకు అభ్యర్థులను నిర్ణయించాలని అధిష్టానం భావించింది. రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికను ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఈ నెల 28న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.