యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రతిపక్షనేత జగన్ దృష్టిలో రాజకీయాలు వ్యాపారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గత ఎన్నికల్లో జైళ్లకు వెళ్లిన వాళ్లకు సీట్లు ఇచ్చారని, ఈ ఎన్నికల్లో వ్యాపారులకే వైసీపీ టెకెట్లు ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులు వన్ టైమ్ ప్లేయర్స్ అని అన్నారు. డబ్బు సంచులే వైసీపీ టికెట్లకు కొలమానమని దుయ్యబట్టారు. ఎన్నికకో అభ్యర్థి మారడం వైసీపీ రివాజు అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారని...కేసీఆర్, మోదీ సహకారంతో వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఆస్తులున్న వారిపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ సారి తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషం వరకు సాగదీయబోమని వెల్లడించారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు పార్టీ యంత్రాంగం కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.