యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో శనివారం కొత్త, పాత కార్పోరేషన్లు కలుపుకుని 32 కార్పోరేషన్ చైర్మన్లతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీ, శాసనసభ్యుల స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసనం కానుందని, ఎన్నికల వరకూ ప్రజా క్షేత్రంలో మెలగాల్సిన అంశాలపై కార్పోరేషన్ చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై 79.25 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమైందని తెలిపారు. వివిధ వర్గాలను ప్రాతినిద్యం వహిస్తున్న మీరంతా ఆయా వర్గాల్లోనే కాదు ప్రతిపక్ష నాయకులు, మేధావులు, సేవాతత్పరుల విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాన్ని పొందాలన్నారు. గతంలో ఏ పార్టీ చేయని రీతిలో అన్ని కులాలు, వర్గాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలను లబ్ది చేకూరుస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ.24 వేల రుణమాఫీ, పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ.20 వేలు, నిరుద్యోగభృతి రూ.2 వేలు ఇలా.. అన్ని వర్గాలను మేలు చేకూర్చామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.10 వేలు అందించనున్నామని తెలిపారు. ఆదరణ పథకం అమలు చేస్తూ ఇంటికే పరికరాలను లబ్దిదారులకు అందించాం. మన ప్రభుత్వం పట్ల ప్రజల్లో పలుకుబడి, నమ్మకం బాగా స్పందిస్తున్నారు. ప్రతిపక్షాలను ముఖ్యంగా జగన్, తెలంగాణా సీఎం కేసీఆర్, ప్రధాని మోదీల కుయుక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వారు చేసే రాజకీయాన్ని ఓ కంట కనిపెట్టాలని పేర్కొన్నారు. పదవులు ఇవ్వడం వరకే తన వంతు అని తద్వారా సమర్థత నిరూపించుకోవాలన్నారు. ప్రతి నాయకుడు ప్రజల్లో ఉండాలి, అహం కూడదు. ప్రజలతో మమేకం అయినప్పుడే ఫలితాలు అమోఘంగా ఉంటాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. ప్రభుత్వ పథకాలను తమతమ సామాజిక వర్గాల్లోకి తీసుకెళ్లాలన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఒకరిద్దరు పార్టీ మారినా మనకు నష్టం లేదు. ఆమంచి, అవంతి అవకాశవాదులని పేర్కొన్నారు. మనతో పనులు చేయించుకొని మనపైనే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రోచర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.