యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టాలని భావిస్తోన్న తెలుగుదేశం పార్టీకి పార్టీ ఫిరాయింపులు సమస్యగా మారాయి. గత ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి 20మందికి పైగా ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకు చంద్రబాబు పన్నిన వ్యూహాన్నే ఇప్పుడు వైసీపీ అమలచేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, చీరాల ఆమంచి ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కొద్దిరోజుల క్రితమే జగన్ సమక్షంలో వైసీపలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం ఆయన అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాగుంటను బుజ్జగించేందుకు చంద్రబాబే రమ్మన్నారా? లేక పార్టీ మారే అంశాన్ని పార్టీ అధినేతకు వివరించడానికి ఆయనే స్వయంగా వచ్చారా? అన్నది తేలాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చీరాల ఎమ్మెల్య ఆమంచి కూడా చంద్రబాబు కలిసిన తర్వాతే పార్టీ మారుతున్నట్లు ప్రకటించి వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మాగుంట కూడా అదే తరహాలో చంద్రబాబు షాకిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు పార్లమెంటరీ నియోజకరవర్గం నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అనంతరం టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అయితే ఇటీవల పార్టీ అధిష్ఠానం వైఖరిపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. దీనిపై గురువారం తన అనుచరులతో భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా అసత్యమేనని ఆయన అనుచరులు చెప్పడం గమనార్హం.