యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. దీంతో పాటు మరికొందరు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి తన కుమార్తె వివాహ విందును రద్దు చేసి ఆ నగదును అమరవీరుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు. దేవాషి మనేక్ అనే వజ్రాల వ్యాపారి కుమార్తె వివాహం ఈనెల 15న జరిగింది. 16న పెద్ద ఎత్తున వివాహ విందు ఇవ్వాలని అనుకున్నారు. కానీ పుల్వామా దాడి ఘటన జరిగిన నేపథ్యంలో విందును రద్దు చేశారు. అందుకు ఖర్చు చేయాలనుకున్న డబ్బును తన వంతుగా అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే విందు కోసం కేటాయించిన రూ.11లక్షలను అమరవీరుల కుటుంబాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సర్వీస్ ఏజెన్సీలకు మరో రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటించడంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.