తూర్పుగోదావరి:
జిల్లాలో సాగునీటి కాల్వల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. సాగునీటి భారాన్ని అదుపుచేయలేని పరిస్థితి. కాలువల ఆధునికీకరణపేరుతో సాగునీటి నిర్మాణాలను నిర్లక్ష్యంగా వదిలేయడంతో వాటిపరిస్థితి అధ్వానంగా మారాయి. ప్రధానకాలువలపై ఉన్న వీటిపరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. కిర్లంపూడి మండలంలోని పలు ప్రధానసాగునీటి కాలువల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. వాటిపై ఉన్న నిర్మాణాలు పైకాలువలకు నీరుపారేలా నీటిని అదుపుచేయాల్సి ఉండగా ఏమాత్రం సహకరించడంలేదు. దీంతో నీరు వృథాగా కిందికి పోతుండగా పైనున్న కాలువలపై చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు పారక రైతులు అవస్థలు పడుతున్నారు. ఎస్.తిమ్మాపురం ప్రధాన రెగ్యులేటరు నుంచి ఉన్న ప్రధానకాలువ వెంట ఉన్న తామరాడ, రామచంద్రపురం, గోనేడ, పాలెం గ్రామాల్లో పలుకాలువలకు సాగునీరు పారడంలేదు. ఆయాగ్రామాల్లో వందలాది ఎకరాలకు సాగునీరు పారక రైతులు ప్రత్యామ్నాయ సాగునీటి విధానాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధాన కాలువ పక్క నుంచే వెళ్తున్నా రైతులు చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల నాలుగు గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపరిష్కారానికి గోనేడ గ్రామశివారు తూర్పుపాకల వంతెన వద్ద ప్రధానకాలువపై నీటిని అదుపు చేసేందుకు సాగునీటి నిర్మాణాన్ని చేపట్టాలని చాలాకాలంగా రైతులు కోరుతూ వస్తున్నారు. ఆధునికీకరణలో దానిని చేపడతామంటూ చెపుతూ వస్తున్న జలవనరులశాఖ అధికారులు దీనిపై ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు.
ఏలేరుపై ప్రధాన సాగునీటి నిర్మాణాల్లో ముక్కొల్లు రెగ్యులేటరు ఒకటి. ఏలేరు ఎర్రకాలువ, ఖండికాలువ, వాలుకాలువ విస్తరణలో భాగంగా ఇక్కడి రెగ్యులేటరును 45 మీటర్ల మేర విస్తరించి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి మొదటిదశ ఆధునికీకరణ పనుల్లో ఇప్పటివరకు ఇక్కడి నిర్మాణానికి మంజూరు లభించడలేదు. దీంతో కాలువలు పూర్తిస్థాయిలో విస్తరణ చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే నిర్మాణాన్ని చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈనిర్మాణం పూర్తయితే రామకృష్ణాపురం, రాజుపాలెం, ముక్కొల్లు, పిఠాపురం మండలంలోని గోకాడ, రాపర్తి, రాయవరం గ్రామాల్లో సుమారు 5వేల ఎకరాలకు సాగునీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం ఈప్రదేశంలో ఉన్న నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాలుకాలువపై కొత్త రెగ్యులేటరు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరు, వాటి షట్టర్లు నీటిని అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. తులుపువెంట నీరు వృథాగా కిందికిపోతుంది. ఈపక్కనే ఉన్న మధుంకాలువ షట్టర్లు పూర్తిగా పాడైపోయాయి. గెద్దనాపల్లి మెరక కాలువపై ఆయకట్టుకు చాలాకాలంగా సాగునీరు పారడంలేదు. వేలంక, జగపతినగరం కాలువలకు సాగునీరు పారడంలేదు. ఈ కాలువలపై సుమారు ఆరువేల ఎకరాలకు సాగునీరు పారేలా ఏలేశ్వరం మండలం తిరుమాలివద్ద ఏలేరు ప్రధాన కాలువపై రూ.12కోట్లతో భారీ సాగునీటి నిర్మాణం పూర్తిచేసి రెండేళ్లు గడుస్తుంది. చాలా కాలంగా నీరుపారక పోవడంతో ఈకాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని ఖాళీచేయించి పూర్తిస్థాయిలో కాలువను విస్తరించాల్సిఉంది. అదీ ముందుకు సాగడంలేదు. ఎస్.తిమ్మాపురం రెగ్యులేటరు నుంచి కుడి, ఎడమ కాలువలను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి వాటికి స్లూయీజ్‌లు, షట్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవీ ముందుకు సాగడంలేదు.
కిర్లంపూడి మండలంలోని పలుకాలువలను విస్తరింపచేసేందుకు, నిర్మాణాలు చేపట్టేందుకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. ముక్కొల్లు గ్రామంలో ఎర్రకాలువను, ఖండికాలువను పూర్తిగా విస్తరించేందుకు చేపట్టిన భూసేకరణ మూడేళ్లు ముందుకు సాగడంలేదు. దీంతో కాలువ పనులు చేపడదామన్నా ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడిందని జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. భూపాలపట్నం, గెద్దనాపల్లి, రామకృష్ణాపురం, రాజుపాలెం గ్రామాలకు చెందిన భూసేకరణ ఫైల్స్ రెవెన్యూ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఇదేతరహాలో మండలంలో పలుకాలువల విస్తరణకు భూసేకరణ సకాలంలో పూర్తిచేయాల్సి ఉంది.