YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పల్లె గొంతెండుతోంది

పల్లె గొంతెండుతోంది

వర్షాభావంతో జిల్లాలో భూగర్భ జలం అడుగంటింది. గొంతు తడుపుకొనే గుక్కెడు నీటికి గ్రామీణం తల్లడిల్లుతోంది. 17ఏళ్ల క్రితం తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు తెదేపా ప్రభుత్వం పార్నపల్లి నుంచి నీటి సరఫరాకు రూపకల్పన చేసింది. రూ.కోట్లు ఖర్చుచేసి వందల కి.మీల పైపులైన్లు, సంపులు, వాటర్‌ ట్యాంకులు ఏర్పాటు చేసింది. అప్పటి పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం సమగ్ర రక్షిత మంచినీటి పథకంగా నిర్వహిస్తున్న సత్యసాయి నీటి పథకాన్ని నిర్మించింది. పథకం ప్రారంభంలో ట్యాంకర్ల నీటి సరఫరాతో పైపులైను ట్రయల్‌ రన్‌ ద్వారా పరీక్షించారు. అంతా సవ్యంగా ఉందనిపించారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించేశారు. ఇప్పటి దాకా ఆ పథకంతో తాగునీరు సరఫరా కాని గ్రామాలు ఉన్నాయంటే నిర్వహణ ఎంత అధ్వానమో ఇట్టే అర్థమవుతుంది. సరఫరా చేస్తున్న నీళ్లు సంపులకే పరిమితం అవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా సమగ్ర మంచినీటి సరఫరా అస్తవ్యస్తమై పథకం లక్ష్యానికి దూరంగా ఉందని గగ్గోలు పెడుతున్నారు.

పార్నపల్లి నుంచి తాగునీటిని మూడు మార్గాల ద్వారా ఆరు మండలాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇందులో పార్నపల్లి నుంచి కదిరికి సమీపంలోని గుర్రాల వంక సంపునకు నీరొస్తుంది. అక్కడి నుంచి కమతంపల్లి సంపు నుంచి గాండ్లపెంట, నంబులపూలకుంట మండలాలకు పైపులైను ఏర్పాటు చేశారు. నల్లచెరువు, తనకల్లు మండలాలకు మరో పైపులైను ఏర్పాటు చేశారు. తలుపులకు ప్రత్యేక మార్గంతో సరఫరా చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ, ఓబుళదేవరచెరువు, అమడగూరు మండలాలకు మలకవేముల క్రాస్‌ నుంచి నీరందించేలా పైపులైను మార్గం ఏర్పాటు చేశారు. ఈ మూడు మండలాలకు నల్లమాడలో ఏర్పాటు చేసిన సంపు ద్వారా రోజుకు 40 లక్షల నీరు అందించాల్సి ఉంది. నల్లమాడ నుంచి కొండకమర్ల, దాదిరెడ్డిపల్లి, నిలువరాతిపల్లి, తోళ్లపల్లి సంపుల ద్వారా వెళ్లే నీటితో 138 గ్రామాలకు నీరు వెళ్లాల్సి ఉంది. కుటాగుళ్ల వద్ద ఉన్న గుర్రాలవంక సంపు నుంచి తనకల్లు మండలానికి నీటి సరఫరాకు చిన్నపల్లెవాండ్లపల్లిలో 8లక్షలు, మండ్లిపల్లిలో పదిలక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 131 గ్రామాలకు నీరందించాల్సింది. అల్లుగుండులోని 11 లక్షల లీటర్ల సామర్థ్యపు సంపు నుంచి నల్లచెరువు మండల వ్యాప్తంగా 60 గ్రామాలకు, తలుపులకు 9 లక్షల లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉంది.

నీటి సరఫరా సంపులకే పరిమితమవుతోంది. ఆయా మండలాల్లోని సుమారు 125 గ్రామాలకు నీరందని స్థితి. సరఫరా అయ్యే గ్రామాల్లోనూ కొన్నింటికి అరకొర నీటి సదుపాయమే. రూ.ఏడు కోట్లతో ఏర్పాటు చేసిన పథకం ద్వారా నంబులపూకుంటకు వెళ్లాల్సిన నీరు కమతంపల్లి, ధనియానిచెరువు సంపు వరకే వెళ్తోంది. దీంతో ఎన్పీకుంటలోని చాలా గ్రామాలకు దాహార్తి తీరలేదు. గాండ్లపెంట మండలంలో 62 గ్రామాలకు నీళ్లివ్వాల్సి ఉండగా 40 గ్రామాలకే వెళ్తున్నాయి. 15 ఏళ్లు దాటినా నంబులపూలకుంటకు నీళ్లు వెళ్లని పరిస్థితి. పైపులైను సక్రమంగా లేకపోవటంతో తరచూ మరమ్మతులతోనే పదేళ్లకు పైగా కాలం గడిచిపోయింది. ప్రస్తుతం ఎన్పీకుంట మండల ప్రజల దాహార్తి తీర్చేందుకు ధనియానిచెరువులో ఓవర్‌హెడ్‌ట్యాంకు నిర్మాణ పూర్తయింది. బందారుచెట్లపల్లి వద్ద సంపు నిర్మాణం జరుగుతోంది. నల్లచెరువు మండలానికి అరకొరగా నీరందుతోంది. తనకల్లు మండలం మండ్లిపల్లి సంపునకు గతంలో అరకొరగా నీరొచ్చేది. అదీ పైపులైన్లకే పరిమితం అయ్యేది. అడపాదడపా మాత్రమే గొంతు తడిసేదని జనం గగ్గోలు పెడుతున్నారు. కొన్నాళ్లుగా సంపునకే నీరందని పరిస్థితి. మలకవేముల మార్గంలోని పైపులైను ద్వారా నల్లమాడ, ఓబుళదేవర చెరువు మండలాలకు అరకొర గ్రామాలకే నీరు చేరుతోంది. అమడగూరు మండలంలోని రెండు సంపుల్లో నీటి సరఫరా నిలువరాతిపల్లి సంపునకే పరిమితమైంది. ఆ శాఖ సిబ్బంది మాత్రం కస్సముద్రం, జేకేపల్లి, మహమ్మదాబాదు పంచాయతీలకు నీరిస్తున్నట్లు చెబుతున్నా జేకేపల్లిలో తామెప్పుడు చూడలేదని ప్రజలు అంటున్నారు.

సుదూరంలోని పార్నపల్లి జలాశయం నుంచి సరఫరాకు పైపులైన్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభం నుంచి నీరందని కారణంగా చాలా ప్రాంతాల్లో భూమిలో వేసిన పైపులు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. అమడగూరు మండలంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు, పొలం పనులతో బయట పడిన పైపులు మాయమైనట్లు మండలంలో చర్చసాగుతోంది. తనకల్లు మండలంలో రెండు విడతలుగా పైపులైన్లు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మొదట్లో ఏర్పాటు చేసిన పైపులైను తోడేసి అధికారులే తీసుకెళ్లారు. పైపుల్లో చేరని, తాగని నీళ్లకు లెక్కలు కట్టి బిల్లులు డ్రా చేస్తున్న వ్యవహారమూ నడుస్తోంది. నీటి సరఫరా లెక్కల్లో మాత్రం లీటర్లు తగ్గకుండా బిల్లులు చేస్తున్నారు.

Related Posts