మత్స్యకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో.. వారికి తోడ్పాటునందించేలా రాష్ట్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితం కారంచేడు సమీపంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలో కేవలం దర్శి, కారంచేడులలో మాత్రమే ఈ తరహా కేంద్రాలున్నాయి. కార్యాలయ భవనాలు ఏర్పాటు చేశారు. సామగ్రి నిల్వ చేసేందుకు అదనంగా మరో భవనం కూడా నిర్మించారు. చేపల పెంపకానికి ప్రత్యేకంగా బావులు, చేపపిల్లలను పెంచేందుకు ప్రత్యేకంగా నీటితొట్లు ఏర్పాటు చేశారు. కారంచేడు సమీపంలో స్వర్ణ రోడ్డులో దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో చేప పిల్లల పెంపక కేంద్రం నిర్మించారు. మత్స్య అభివృద్ధి శాఖ అధికారిని కూడా నియమించారు. కుంట, డొంక భూములు ఇందుకు కేటాయించారు. కొమ్మమూరు కాలువ పక్కనే ఉండటంతో నీటి సమస్య లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఆశయానికి అనుగుణంగా ఇప్పుడు పని తీరు లేకపోయింది.
చేపలు తెచ్చి బావుల్లో వేసి గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలను ఉత్పత్తి చేసేలా తొలుత కార్యాచరణ రూపొందించారు. ఏడాదికి 40 లక్షల వరకు ఇలా ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణాలు చేశారు. చేపలు తెచ్చి పిల్లలు ఉత్పత్తి చేసే ప్రక్రియ మూణ్నాళ్ల ముచ్చటైంది. కొంతకాలం తర్వాత రోజుల వయస్సులో ఉన్న చేపపిల్లలను తెచ్చి పెంచే ప్రక్రియ ప్రారంభించారు. మూడు నెలల వయస్సు సమయంలో చేపపిల్లలను మత్స్యకారులకు పంపిణీ చేసేవారు. వాటిని చెరువులు, గుండ్లకమ్మ జలాశయం, కాలువల్లో పెంచుకొని తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. సాధారణంగా ప్రతి సంవత్సరం జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేపపిల్లల ఉత్పత్తి చేపడతారు. కొమ్మమూరు కాలువ నీరు వచ్చేందుకు, వృథా నీరు వెళ్లేందుకు ప్రత్యేకంగా కాలువలు ఏర్పాటు చేశారు. ఉన్నతాశయంతో ప్రారంభించిన చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం కాలక్రమేణా నిరుపయోగంగా మారుతోంది. కొమ్మమూరు కాలువలో నీటి సరఫరా సక్రమంగా లేక దాదాపు 3 సంవత్సరాలుగా ఉత్పత్తి నిలిచిపోయింది. రెండేళ్ల నుంచి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించారు. ఏడాదికి 40 లక్షలు లక్ష్యం అయితే కేవలం 5-10 లక్షల చేపపిల్లల పెంపకం మాత్రమే చేపడుతున్నారు. ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. చేపపిల్లల పెంపకానికి అవసరమైన ఆహారం, తదితర ఖర్చులకు వీటిని వెచ్చిస్తారు. నిధుల వినియోగంలోనూ పారదర్శకత కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భవనాలను పూర్తిస్థాయిలో వినియోగించక పోవడంతో నిరుపయోగంగా మారాయి. కొన్ని శిథిలావస్థకు చేరాయి. శ్లాబు పెచ్చులూడి పడుతోంది. ఎప్పుడు ప్రమాదం వాటిల్లుతుందో అనే భయంతో కార్యాలయంలో బిక్కుబిక్కుమంటూ సిబ్బంది కాలం వెళ్లదీస్తున్నారు. చేపల పెంపకానికి నిర్మించిన బావులు మొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. చేపపిల్లలు పెంచేôదుకు నిర్మించిన తొట్ల నిర్వహణ కూడా సక్రమంగా లేకపోయింది. తొట్లలో నీరు నిల్వ ఉండడం లేదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. చేపపిల్లల పెంపక కేంద్రం నిరుపయోగంగా మారడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గ్రామానికి దూరంగా ఉండడంతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ప్రాంగణంలో పడేసిన ఖాళీ మద్యం సీసాలు, పేక ముక్కలే ఇందుకు నిదర్శనం.