కేస్లాపూర్ పులకించింది.. వనం జన సంద్రమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవ నాగోబాకు మెస్రం వంశీయులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన సంప్రదాయ పూజలతో మహాజాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు ఉదయం 11గంటల నుంచి మహాపూజలకు శ్రీకారం చుట్టారు. ముందుగా నాగోబా ఆలయం వెనుక ఉంచిన మట్టి కుండలను 22మంది మహిళలకు మెస్రం వంశీయుల పెద్దలు పంపిణీ చేశారు. మహిళలు కోనేటి వద్ద నుంచి నీటిని తీసుకొచ్చారు. ఆ నీటిని మట్టిలో కలిపి పాముల పుట్టలను, మరికొంత బౌల దేవతల విగ్రహాలను తయారు చేసి ప్రత్యేకంగా పూజించారు.
మెస్రం వంశీయుల సంప్రదాయం ప్రకారం మహాపూజలకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరిలోని హస్తినమడుగు నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మెస్రం వంశీయులు గోవాడ్ నుంచి వెలిగించిన కాగడాలు చేతిలో పట్టుకొని సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకున్నారు.
నాగోబా ఆలయంలో మహాపూజలు నిర్వహించేటప్పుడు ఇతరులను లోనికి రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. 10గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మెస్రం వంశీయులే నాగోబాకు మహాపూజలు చేశారు. మెస్రం వంశీయుల మహాపూజల అనంతరం అతిథులతోపాటు ఇతరులకు పూజలు చేసేందుకు అవకాశం కల్పించారు. అనంతరం కొత్తకోడళ్లతో భేటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత వారికి నాగోబా దర్శనం చేయించారు.