
ఉత్తరాయణంలో మాఘ శుక్ల ఏకాదశి నాడు తన తనుత్యాగానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. మాఘ శుక్ల సప్తమి మొదలుకుని రోజుకొక ప్రాణం చొప్పున విడుస్తూ ఏకాదశి నాటికి విష్ణువులో లీనమైపోయాడని, అందువల్ల ఆ అయిదు రోజులను భీష్మ పంచకం అంటారని మహాభారత కథనం. పై కథనం ఆధారంగా భీష్ముడి నిర్యాణ దినాన్ని భీష్మ ఏకాదశిగా జరుపుతారు.
వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు! తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో.... ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు.
భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున, తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు, రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము.
ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికీ వర్తిస్తాయి. దశమినాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం ఉండమనీ, ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమనీ పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈనాడు జపిస్తే, విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుచుకోవడం కద్దు. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు.
భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే! ఆచార్యునిగా, భరతవంశంలోని ఆదిపురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. ఈ రోజున భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు.
*ఉపవాసం*
ఉపవాసం అంటే కడుపు మాడ్చుకుని నిరా హారంగా ఉండటం కాదు. ఉపవాసం అర్థం ‘ఉప’ అంటే దగ్గర, వాసము అంటే ఉండటం. భగవంతునికి ‘దగ్గరగా ఉండటమే’ ఉపవాసం. అంటే భగవంతుని నామస్మరణ, భజన, సంకీర్తనం, పూజలు చేస్తూ, భగవంతుని రూపాన్ని మనసులో నిలుపుకుని, భగవంతునికి చేరువవ్వాలి. భగవంతునికి చేరువ కావలంటే మితాహారం, సాత్వికాహారం తీసుకోవాలి. అప్పుడే మనసు భగవంతుని మీద లగ్నం చేయగలం. ఈ భావన నుండి పుట్టిందే ఉపవాస దీక్ష.
ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు కొంత విశ్రాంతి లభిస్తుంది. శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను బయటకు తొలగించటానికి, అదనపు కొవ్వును ఖర్చు చేయటానికి ఉపవాసం ఉపయోగపడుతుంది.