ఎన్నికల సీజన్ వచ్చేసింది. రాజకీయాలు వేడెక్కాయి. సినిమాలు-రాజకీయాలు రెండు కళ్లుగా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నేతలు.. కొన్నేళ్లుగా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నేతలు సినీ హీరోయిన్లతో రాజకీయం మొదలు పెట్టారు. పాపం.. తమతో కూడా రాజకీయం చేస్తున్నారన్న విషయం తెలియక టాలీవుడ్ హీరోయిన్ నెల్లూరు నేతల రాజకీయాల్లో పావుగా మారిపోతున్నారు.సూళ్లూరు పేటని ఆనుకొని పులికాట్ సరస్సు ఉంది. అక్కడికి ప్రతీ అక్టోబర్ - నవంబర్ నెలల్లో సుమారు 130కు పైగా వివిధ దేశాల పక్షలు నేలపట్టుకు వచ్చి సందడి చేస్తాయి. విదేశీ పక్షుల సందడిపై 2001 నుంచి ఏపీ ప్రభుత్వం వేడుకగా నిర్వహిస్తుంటుంది. పండుగ ఖర్చుల కోసం ప్రతి ఏటా నిధులను విడుదల చేస్తుంటుంది. అయితే ఈ పండుగను పురస్కరించుకొని స్థానిక పారిశ్రామికవేత్తలు - బడా కాంట్రాక్టర్లు - రాజకీయ నేతలు తెగ హడావుడి చేస్తుంటారు. సినీ హీరోయిన్లని కూడా ఈ వేడుకకి రప్పించడం ద్వారా తమ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ హీరోయిన్లను ఈ పండుగ కోసం ఎంత ఖర్చు చేసైనా తీసుకొస్తుంటారు.ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం కూడా ఈ పండుగ కోసం రూ.3 కోట్ల రూపాయలను కేటాయించింది. అందులో రెండున్నర కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలి. పండుగ ఖర్చుకు రూ.50లక్షలు వినియోగించాలి. కానీ పండుగ నిర్వహణకే రూ.3 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. హీరోయిన్లు కళాకారుల పేరు చెప్పి ఓ ప్రైవేటు సంస్థ పెద్ద మొత్తాల్లో డబ్బు స్వాహా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గతేడాది హీరోయిన్ హన్సికను తీసుకొచ్చారు. ఆమె రెండు నిమిషాలు వేదికపై కనిపించింది. దీనికి గాను హన్షికకు 16లక్షల 50వేలు చెల్లించినట్టు లెక్కచూపారు. ఇక తమన్ ఒక్కపాటకు 10 లక్షలు ఇచ్చారట.. కారు కూడా దిగని కామ్న జెఠ్మలాని కి ఆరున్నర లక్షలు ఇచ్చినట్టు లెక్కలున్నాయి. వాస్తవానికి సినిమాల్లో ఇంత సమయం నటించినా అంతపెద్ద మొత్తం సదురు హన్సిక కామ్నా జెఠ్మాలానికి రావట.. బహుషా వీరి పేర్లు చెప్పి పెద్ద మొత్తాలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఈ విషయం హీరోయిన్లకు కూడా తెలియకపోవచ్చని సమాచారం.ఈ సంవత్సరం ఎన్నికల సీజన్ కావడంతో కాజల్ - అనుపమ - అక్ష - మెహరీన్ - లను తీసుకొచ్చారు. వీరి పేరుతో ఎంత గుంజారో ఇంకా లెక్కతేలలేదు. ఎంత పెద్ద హీరోయిన్ వస్తే అంత వెచ్చించాలి. మరి వీరికి ఎంత ఇచ్చారో ఆ దేవుడికే తెలియాలి. పెద్ద హీరోయిన్లను తీసుకొచ్చామని గొప్పగా స్థానిక నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.. వాళ్ల విలాసాలకు ప్రభుత్వ సొమ్మును పలహారంగా ఖర్చు చేస్తున్నారు.పక్షుల పండుగ పేరుతో హీరోయిన్లను రప్పించడం.. జనంలో వారి గురించి చర్చ జరిగేలా చేయడం.. ఆ తర్వాత మరుగున పడిపోవడం ఇక్కడ ఖాయంగా కనిపిస్తోంది. వీరు వస్తే ఓట్లు కూడా రాలేలా లేవు. ఆ సొమ్ముతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది. కానీ హీరోయిన్ల పేరు చెప్పి దోచుకుంటున్న రాజకీయ నాయకుల వైఖరి విమర్శల పాలవుతోంది. ఓట్ల కోసం తప్పితే ప్రజాప్రయోజనాలు లేని ఈ పండుగ విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదంటున్నారు.