YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబుకు తలనొప్పిగా తయారైన జగ్గంపేట జగడం

బాబుకు తలనొప్పిగా తయారైన జగ్గంపేట జగడం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
జమ్మలమడుగు పంచాయతీ అయిపోయిందనుకుంటే… కొత్తగా జగ్గంపేట జగడం తయారైంది. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా తయారవుతుందనే చెప్పాలి. ఇద్దరు సీనియర్ నేతలు టిక్కెట్ తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతుండటమే ఇందుకు కారణం. ఇద్దరు సీనియర్ నేతలను దూరం చేసుకోలేక, ఇద్దరికీ నచ్చచెప్పలేక తెలుగుదేశం పార్టీ అధినేత తల పట్టుకుంటున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల నుంచి టీడీపీ గెలిచింది లేదు. అయితే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో అందరూ వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూయే పోటీ చేస్తారనుకున్నారు. కానీ జగ్గంపేట లో ఎన్నికల సమయానికి సీన్ మారేటట్లుంది. ఇప్పుడు కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం కుటుంబం ఎంటరయింది. తమకే జగ్గంపేట సీటు కావాలని పట్టుబడుతోంది. దీంతో జ్యోతుల, తోట కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ విభేదాలకు మంత్రి నారాలోకేష్ మరింత ఆజ్యం పోశారు. ఈసారి టిక్కెట్ జ్యోతుల నెహ్రూకేనని లోకేష్ ప్రకటించడంతో తోట కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో తోట నరిసింహం జగ్గంపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మంత్రిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేశారు. తాము జగ్గంపేటను వదులుకునేది లేదని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఈసారి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశ్యం తనకు లేదంటున్నారు తోట. ఒకవేళ అధిష్టానం వత్తిడి తెచ్చి తనకు ఎంపీ సీటు ఇస్తే జగ్గంపేట సీటు మాత్రం తన భార్య తోట వాణికి ఇవ్వాలని కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తోట వాణి మాజీ మంత్రి, సీనియర్ నేత దివంగత మెట్ల సత్యనారాయణ కుమార్తె. ఆమెకు పార్టీ శ్రేణుల్లోనూ,ప్రజల్లోనూ మెట్ల కుమార్తెగా గుర్తింపు ఉంది. దీంతో తోట వాణికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాల్సిందేనని, లేకుంటే పార్టీ మారేది ఖాయమన్న సంకేతాలను తోట కుటుంబం అధిష్టానానికి ఇప్పటికే పంపింది.మధ్యేమార్గంగా తోట వాణికి పిఠాపురం టిక్కెట్ ఇస్తామన్న ప్రతిపాదన టీడీపీ నుంచి వచ్చినట్లు తెలిసింది. తోట నరసింహకు కాకినాడ సీటు, ఆయన భార్య వాణికి పిఠాపురం అసెంబ్లీ సీటు ఇచ్చి, జ్యోతుల నెహ్రూను జగ్గంపేటలోనే కంటిన్యూ చేయాలన్న ప్రతిపాదన తెరమీదకు టీడీపీ హైకమాండ్ తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు తోట ఫ్యామితీ తిరస్కరించినట్లు చెబుతున్నారు. మరోవైపు జ్యోతుల నెహ్రూ కూడా తనకు కాని, తన కుమారుడు జ్యోతుల నవీన్ కు కాని టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. జ్యోతులకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని చెప్పినా ఆయన అంగీకరించలేదట. దీంతో్ జగ్గంపేట జగడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న టెన్షన్ టీడీపీలో ఉంది. మరి చంద్రబాబు జగ్గంపేట విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

Related Posts