యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను, గుర్తింపును సాధించిన దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు పరువు పోతోందా? ఆయన పరువును కాపాడాల్సిన పుత్రరత్నాలే.. ఆయన పరువును బజారున పడేస్తున్నారా? ఎమ్మెల్యే టికెట్ కోసం రోడ్డెక్కి కొట్టుకుంటున్నారా? అంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లోని నగరి నియోజకవర్గానికి చెందిన గాలి ముద్దుకృష్ణకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అజాత శత్రువుగా, నిర్మాణా త్మక వ్యవహారశైలితో, విమర్శనాత్మక దృక్ఫథంతో ఆయన వ్యవహరించిన తీరు ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. ఏ పదవిలో ఉన్నా.. తనకంటూ.. ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా, ప్రజలను కలుపుకొని పోతూ.. ముఖ్యంగా పార్టీల్లో మంచి పేరు తెచ్చుకుని ప్రతి ఒక్క రి తోనూ అన్న అని అనిపించుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నాయకుడి కడుపున పుట్టిన ఇద్దరు కు మారులు గాలి జగదీష్, గాలి భాను ప్రకాష్‌లు ఇద్దరూ ఇప్పుడు తండ్రి పరువును పోగొడుతున్నారనే వాదన తెరమీదికి వ స్తోంది. గత ఏడాది గాలి హఠాన్మరణంతో ఖాళీ అయిన నగరి టికెట్‌ను వచ్చే ఎన్నికల్లో గాలి వారసుల్లో ఒకరికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు అయితే, దీనికి సంబంధించి ఇద్దరు కుమారులు కూడా తమకంటే తమకే ఇవ్వాలని వర్గ పోరుకు దిగారు. ఇప్పటికే భాను ప్రకాష్ టికెట్ తనదేననే కోణంలో ర్యాలీలు నిర్వహించారు. వర్గాలను మెయింటెన్ చేస్తున్నారు.నిజానికి చంద్రబాబు కూడా గాలి కుటుంబాన్ని ఆప్యాయంగానే చూస్తున్నారు. గాలి మృతి చెందిన అనంతరం వెంటనే ఖాళీ అయిన ఎమ్మెల్సీ పోస్టును చంద్రబాబు ఈ కుటుంబానికే ఆఫర్ చేశారు. అప్పట్లోనూ ఈ టికెట్ ను తమకంటే తమకేనని చిన్న కుమారుడు జగదీష్, పెద్ద కుమారుడు భాను పంతానికి పోయారు. తీరా ఈ పంచాయితీ అమరావతికి చేరడంతో మధ్యేమార్గంగాగాలి సతీమణి.. సరస్వతమ్మకు చంద్రబాబు ఈటికెట్‌ను ఇచ్చారు. అప్పట్లోనే సుతిమెత్తగా ఇద్దరు కుమారులను చంద్రబాబు హెచ్చరించారు. మీ నాన్న పరువు కాపాడేలా వ్యవహరించాలని, పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసుకుని అడుగులు వేయాలని హితవు పలికారు.ఇప్పుడు ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో మళ్లీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరూ కూడా పోటీకి రంగం చేసుకున్నారు. దీంతో ఈ పరిణామంపై అధిష్టానం విస్మయం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి గాలి జీవించి ఉన్న రోజుల్లో.. భానును తన రాజకీయ వారసుడిగా ప్రజలకు పరిచయం చేశారు. నగరి నియోజకవర్గంలో భానును అన్నా అంటూ ప్రతి ఒక్కరూ అక్కున చేర్చుకున్నారు. కానీ, టికెట్ కోసం ఇప్పుడు చిన్న కుమారుడు కూడా రంగంలోకి రావడంతో ప్రజల్లోనే ఓ విధమైన అయోమయం నెలకొంది. దీంతో పరిస్తితి మొత్తం ఎటు ఎలా ఎప్పుడు మళ్లుతుందోనని ఆసక్తిగా మారిపోయింది. ఏదేమైనా.. తండ్రి తగ్గతనయులు అనిపించుకోవడం అటుంచితే.. తండ్రి పరువు తీస్తున్న పుత్ర రత్నాలుగా మాత్రం గాలి వారసులు నిలుస్తున్నారనే అపవాదు హల్‌చల్ చేస్తుండడం గమనార్హం.