యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పార్టీ ఫిరాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీ మారుతున్న నేతల గురించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలతో జరిగిన టెలికాన్పరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయని, పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని అన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాకెందుకులే అనే మౌనం నేతలకు తగదని అన్నారు.ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మార్పు గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అవంతి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని…అందుకే ఆయనను బెదిరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీక్ష రోజు తనతో ఢిల్లీలో తిరిగి ఆ మరుసటి రోజే పార్టీని వదిలి వెళ్లారంటే ఏమనాలని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం మనం కేంద్రంతో యుద్దం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇందులో గెలుపే మన లక్ష్యం. మోడీ, జగన్, కేసీఆర్.. ఈ ముగ్గురి కుట్రలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులను ఆ వర్గం నేతలే ఖండించాలని ఆదేశించారు. తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు.టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల ప్రచారంపైనా ప్రస్తావించిన టీడీపీ అధినేత.. వైఎస్ జగన్ హైదరాబాదులో కూర్చొని రాజకీయం చేస్తున్నారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో తన పార్టీ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు మరోవైపు హైదరాబాద్‌లో ఆస్తులున్న కొందరు నేతలు కేసీఆర్‌కు భయపడుతున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ఏపీలో పాదయాత్ర చేసి జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారంటూ సెటైర్లు వేశారు. అమరావతికి రావడానికే వైఎస్ జగన్ ఇష్టపడడం లేదని విమర్శించిన ఆయన… వైసీపీ ఒకసారి టిక్కెట్ ఇస్తే మళ్లీ ఇవ్వడం లేదన్నారు. ఎక్కువ డబ్బులిచ్చిన వారికే జగన్ టిక్కెట్లు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు.. జగన్, వైసీపీ అభ్యర్ధులంతా వన్ టైమ్ ప్లేయర్స్ అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాలను జగన్ వ్యాపారంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత.. త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తా.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అభ్యర్ధుల జాబితా చివరి నిమిషంలో కాకుండా.. సరైన సమయంలోనే ప్రకటిస్తామన్నారు.