యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పీలేరు నియోజకవర్గంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతుండటమే. రాష్ట్ర విభజన అనంతరం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర మనస్తాపంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అటు తర్వాత ఆయన ఎన్నికలకు కొద్దిరోజుల ముందు స్థాపించిన జై సమైక్యాంధ్రకు ఎన్నికల్లో అంతగా ఆదరణ దక్కలేదు. అయితే అదే పార్టీ తరుపున పీలేరులో బరిలో ఉన్న కిషోర్‌కుమార్‌రెడ్డి మాత్రం 53 వేలకు ఓట్లకు పైగా సాధించారు. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే గత ఎన్నికల తర్వాత అన్నయ్య ఇన్‌ప్లూయెన్స్‌తోనో లేక సొంత వ్యూహంతోనే మొత్తంగా అయితే కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.కిషోర్‌కుమార్ వచ్చీ రావడంతోనే ఆయనకు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దక్కడం విశేషం. ఇక నాటి నుంచి పీలేరుపై దృష్టి పెట్టిన కిషోర్ ఈ సారి ఎలాగైనా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా గెలిచి తీరాలని ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు పూర్తి మార్గనిర్దేశం చేయడంతో ఆయన దూసుకెళ్తున్నారనే చెప్పాలి. గత ఎన్నికల్లో సొంత ఇమేజ్‌తోనే ఆయన అంత ఎదురుగాలిలోనూ ఆయన 53వేలకు పైగా ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి కిషోర్‌కుమార్ టీడీపీని మూడో స్థానంలోకి నెట్టి రెండో స్థానంలో నిలవడం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెద్ద విషయమనే చెప్పాలి. ఇప్పుడు పరిస్థితులు కిషోర్‌కు సానుకూలంగా ఉన్నట్లు పార్టీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు.వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి పోటీకి దిగుతుండటంతో గట్టి పోటీయే నెలకొననుంది. ఇక నియోజకవర్గంలో 2 లక్షల 19వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈసారి ఇక్కడ టీడీపీ..వైసీపీల మధ్యే పోరు ప్రధానంగా సాగనుంది. జనసేన,కాంగ్రెస్‌ల నుంచి కూడా అభ్యర్థులు నిలబెడేందుకు సిద్ధంగా ఉన్నా అంతగా ప్రభావం చూపకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కొన్ని ఓట్లు మాత్రం జనసేన చీల్చగలదని పేర్కొంటున్నారు. ఇక నల్లారి ఫ్యామిలీకి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఈ సారి ఆ ఫ్యామిలీ పర్సనల్ ఓటు బ్యాంకుతో పాటు టీడీపీ ఓటు బ్యాంకు కూడా ట్రాన్స్‌ఫర్ అయితే టీడీపీ గెలుపునకు ఛాన్సులు ఉంటాయి. అయితే అదే టైంలో వైసీపీ కూడా బలంగా ఉండడంతో పోరు హోరాహోరీగానే ఉండనుంది.