యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్ర ప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జై స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు ఒక ప్రకటలో తెలిపారు. పునర్విభజన అనంతరం ఆంధ్రలో సామాన్య జన పాలన వైపు అడుగులు పడలేదని, పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనం కోసమే ఈ నాలుగున్నరేళ్ల పాలన సాగిందని ఆయన విమర్శించారు. యువతకు ఉద్యోగ కల్పన దిశగా అడుగులు పడలేదన్నారు. రాష్ట్రంలో పేదరికం పెరిగిందని కాసాని పేర్కొన్నారు. గ్రామాలు సమస్యలకు కేంద్రంగా మారాయని, అందుకే తమ పార్టీ గ్రామ స్వరాజ్ కోసం పని చేస్తున్నదని ఆయన అన్నారు. సామాజిక ఐక్యత ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యమని, అందుకోసం పని చేస్తున్న యువత, మేధావులు, ఉద్యమకారులను ఎన్నికల బరిలోకి దించుతున్నామని కాసాని తెలిపారు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పోటీలో ఉంచుతున్నామని, గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. కలం గుర్తు తో పోటీ చేస్తున్నామని కాసాని తెలిపారు.