యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇంకా.. ఖాయం అని చెబుతున్న తిక్కవరపు సుబ్బరామిరెడ్డి వచ్చే ఎనికల్లో విశాఖ ఎంపీ గా పోటీ చేస్తారా అంటే మాత్రం దైవ నిర్ణయం అంటూ దాటవేస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యకరమే. ప్రియాంకాగాంధి రావడంతో కాంగ్రెస్ విజయావకాశాలు బాగా పెరిగాయని చెబుతున్న రెడ్డి గారు ఏపీలోనూ అనూహ్యంగా బలం పుంజుకున్నామని ధీమా వ్యక్తం చేశారు. అన్నీ బాగానే ఉన్నా పోటీకి మాత్రం పెద్దాయన ముందుకు రాకపోవడం గమనినాల్సిన విషయమే.ఇదిలా ఉండగా విశాఖ తనకు పుట్టిల్లు అని చెప్పుకుంటున్న టీఎస్సార్ ఇప్పటికి మూడు మార్లు పోటీ విశాఖ నుంచి పోటీ చేసి రెండు మార్లు నెగ్గారు. 1996 లో తొలిసారి గెలిచిన ఆయన 1998 మధ్యంతర ఎన్నికల్లోనూ రెండవ మారు విజయం సాధించారు. ఇక 1999లో మరో మారు జరిగిన పోటీలో మాత్రం టీడీపీ అభ్యర్ధి ఎంవీవీఎస్ మూర్తి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తరువాత 2003లో తొలిసారి రాజ్యసభకు వెళ్ళారు. 2009, 2015 ఇలా మరో రెండు మార్లు పెద్దల సభకే ఎంపీ అవుతున్నారు తప్ప ప్రత్యక్ష రాజకీయాలవైపు ఆయన చూడడంలేదు. ఇక 2009 ఎన్నికల సమయంలో పోటీకి ముందుకు వచ్చినా పురంధేశ్వరికి టికెట్ ఇవ్వడంతో ఆయన రాజ్యసభకే పరిమితం అయ్యారు. 2014 నాటికి విభజన పుణ్యమాని కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బ తింది. పురంధేశ్వరి కాంగ్రెస్ కి రాజీనామా చేయగా, సుబ్బరామిరెడ్డి పోటీకి నో చెప్పేశారు.ఇక ఏపీలో కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు ఉంటుందని భావించి ఆ మధ్యన ఉత్సాహం చూపించిన రెడ్డి గారు కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పడంతో వెనక్కు తగ్గారని టాక్. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం మాట పక్కన పెడితే డిపాజిట్లు కూడా దక్కవన్న అంచనాలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో కాంగ్రెస్ బాగా కుదేలయిపోయింది. పార్టీకి కార్యకర్తలు కూడా లేరు. నాయకులు ఎపుడో మూటా ముల్లె సర్దుకున్నారు. ఈ సమయంలో టీఎస్సార్ పోటీ చేయడానికి అనాసక్తిగా ఉన్నారు. దాంతో ఓ మాజీ కార్పోరేటర్ విశాఖ ఎంపీ సీటుకు దరకాస్తు చేసుకున్నారు. అన్నీ కుదిరితే ఆయనే అభ్యర్ధి అవుతారని అంటున్నారు.ఇదిలా ఉండగా టీఎస్సార్ పోటీకి ముందుకు రాకపోవడం పట్ల సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంగబలం,అర్ధబలం దండీగా ఉన్న రెడ్డి గారు పోటీకి దిగితే పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, అలాంటిది ఆయనే ఓటమి భయంతో తగ్గిపోతే ఇక ఉన్న కొద్ది పాటి క్యాడర్ కి కూడా స్పూర్తి ఎలా వస్తుందని అంటున్నారు. పార్టీ బలంగా ఉన్న రోజుల్లో, గెలుపు అవకాశాలు ఉన్న వేళ పోటీకి ముందుకు వచ్చి సీట్లు ఎగరేసుకుపోయే పెద్ద నాయకులు ఇపుడు టైం చూసి దెబ్బ వేయడం మంచిది కాదని కూడా అంటున్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ వస్తుంది, ఏపీలో పుంజుకుంది అని కబుర్లు చెప్పే రెడ్డి గారు తానెందుకు పోటీ చేయరని విపక్షాలు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా రెడ్డి గారు రూటే సెపరేట్ అని, ఆయనది వడ్డించిన విస్తరి లాంటి రాజకీయ జీవితమని కూడా సెటైర్లు పడుతున్నాయి