యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వరుసగా టీడీపీ నేతలు పార్టీని వీడుతుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలోకి తెచ్చి ఎన్నికల ముందు జోష్ పెంచుదామనుకున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు సైకిల్ పార్టీ విలవిలలాడిపోతోంది. బలమైన నేతలు పార్టీని వీడుతుండటం, వెళుతూ..వెళుతూ…కులం పార్టీ అని ముద్ర వేసి పోతుండటంతో ఆ పార్టీలో ఆందోళన వ్యక్త మవుతోంది. మొన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నిన్న అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్, నేడు అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు. ఇలా పెద్ద స్థాయిలో ఉన్న నేతలు పార్టీని వీడుతుండటంతో లోపం ఎక్కడనున్నదన్న చర్చ జరుగుతోంది.చంద్రబాబునాయుడు ఒకచట్రంలో కూరుకుపోయి ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. ఇటు ఇంటలిజెన్స్ రిపోర్టులు మీద ఆధారపడుతూ, అధికారులు అందజేస్తున్న సమాచారంతో పాటు తన సన్నిహితంగా ఉన్న కొందరు టీడీపీ నేతలతోనే ఆయన క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుంటున్నారు. వంగవీటి రాధా విషయంలో దూకుడు ప్రదర్శించిన టీడీపీ ఆమంచి, అవంతి, పండుల విషయంలో చేతులెత్తేయడానికి కారణం చంద్రబాబుకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పాటు, ముందుగా పార్టీని వీడుతున్నారని తెలిసినా వారితో సంప్రదింపులు జరపకపోవడం వంటివే కారణమంటున్నారు.చంద్రబాబు వద్దకు వెళ్లాలంటే పార్టీ సీనియర్ నేత తొండెపు దశరథ జనార్థన్ అనుమతివ ఇవ్వాల్సిందే. ఆయన అనుమతి ఉంటేనే చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరుకుతుంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఇదే పరిస్థితి. ఇది కొందరు ఎమ్మెల్యేలకు కూడా సహజంగానే మింగుడుపడటం లేదు. పార్టీని వీడి వెళ్లినవారంతా ఆయనపైనే ఆరోపణలు చేస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా చంద్రబాబు కోటరీపై ఆఫ్ ది రికార్డుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో చంద్రబాబుకు చెప్పడం, వారు పార్టీని వీడి వెళ్లినా నష్టం లేదని నివేదికలు అందించడం వంటివి ఈ కోటరీ చేస్తుందన్న వ్యాఖ్యలు అమరావతిలో విన్పిస్తున్నాయి.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. మరికొంత మంది రెడీ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం ప్రస్తుతం సంక్షేమ పథకాలను అమలు చేసే పనిలోనే ఉన్నారు. ఇటీవల ప్రకటించిన పథకాలపై కూడా చంద్రబాబుకు తప్పుడు నివేదికలు అందించారని చెబుతున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రకటించిన రైతు, డ్వాక్రా, నిరుద్యోగ భృతి వంటి అంశాల్లో ప్రజల నుంచి విపరీతంగా స్పందన ఉందని ఈ కోటరీ నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. మొత్తం మీద బలమైన నేతలు, ముఖ్య నాయకులు ఎన్నికలకు ముందు పార్టీని వీడుతుండంతో లోపం ఎక్కడుందో గమనించాల్సింది పార్టీ అధినేత మాత్రమేనని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.