యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల సర్కార్ ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కినట్లేనా..? ప్రమాదం ఇంకా పొంచి ఉందా? గత కొన్ని నెలలుగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ ను కూలదోసి త్వరగా గద్దెనెక్కాలని భావించారు. అయితే ముఖ్యమంత్రి కుమారస్వామి బేరసారాల ఆడియో టేపులు బయపెట్టడంతో యడ్డీ అండ్ కో ఇరుకున పడింది. ప్రస్తుతానికి బీజేపీ ఆపరేషన్ కు కామా పెట్టినట్లే చెబుతున్నారు. మరోవైపు సిద్ధరామయ్య అసంతృప్త కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలవుతూ వారిని బుజ్జగించే పనిని చేపట్టారు. అయితే సంకీర్ణ సర్కార్ లోని కాంగ్రెస్ నేతలు జేడీఎస్ అంటేనే మండిపడుతున్నారు.ఆపరేషన్ కమల్ కు ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ విరామమిచ్చినా…కాంగ్రెస్ లో మాత్రం ఆ దిగులు పోలేదు. ఇంకా అనేక మంది అసంతృప్తులు పార్టీలో ఉన్నారన్నది మాత్రం వాస్తవం. నిన్న మొన్నటి వరకూ నలుగురు అసంతృప్త ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. రమేష్ జార్ఖిహోళి, మహేష్ కుమటహళ్లి, నాగేంద్ర, ఉమేష్ జాదవ్ లు బహిరంగంగా అసమ్మతివాదులుగా ముద్రపడ్డారు. కొంతకాలం బీజేపీ క్యాంపు లోకి కూడా వెళ్లివచ్చారు. అయితే ఈ నలుగురిపై అనర్హత వేటును కాంగ్రెస్ బయటకు తేవడంతో కొంత మెత్తబడ్డారు.ముఖ్యంగా రమేష్ జార్ఖిహోళి మంత్రి పదవి ఊడబెరకడమే కాకుండా తనకు పట్టున్న బెళగావి ప్రాంతంలో మంత్రి డీకే శివకుమార్ వేలు పెట్టడాన్ని రమేష్ జార్ఖిహోళి సహించలేకపోతున్నారు. సిద్ధరామయ్య భేటీలోనూ ఇదే విషయాన్ని రమేష్ జార్ఖిహోళి సిద్ధరామయ్యతో స్పష్టం చేసినట్లు తెలిసింది. డీకే శివకుమార్ కు అధిష్టానం అండదండలు ఉండటంతో తానేమీ చేయలేక పార్టీని వదిలి వెళ్లిపోవాలనుకున్నానని రమేష్ సిద్ధరామయ్యతో చెప్పుకుని విలపించినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీలో తాను ఉండనని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. ఇదే పద్ధతిలో మరో ఎమ్మెల్యే నాగేంద్ర కూడా ఇలాగే స్పందించారని చెబుతున్నారు. తగ్గినట్లే తగ్గిన ఎమ్మెల్యేలు తాము పార్టీలో ఉండలేమని చెప్పడం కూడా సిద్ధరామయ్యను ఆలోచనలో పడేసింది. మరో అసంతృప్త ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ను టార్గెట్ చేశారు. ఉమేష్ జాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికలలో కలబుర్గి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఖర్గే ను కాదని ఉమేష్ కు అక్కడ సీటు ఇచ్చే సీన్ లేదని తెలుసు. అందుకే ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరి కలబుర్గి ఎంపీగా బరిలోకి దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. తర్వలో ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలిసింది. ఇక కుమారస్వామి పాలనపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు అనేక మంది సిద్ధరామయ్యకు నిత్యం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయితే సంకీర్ణ సర్కార్ కావడంతో తానేమీచేయలేనన్న నిస్సహాయతను సిద్ధరామయ్య వ్యక్తం చేశారు. మొత్తం మీద గండం గట్టెక్కినట్లే కన్పిస్తున్నా కాంగ్రెస్ కు మాత్రం ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి