యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఖమ్మం: మిర్చి సాగు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగు చేసిన రైతులపై కోలుకోలేని దెబ్బపడింది. జిల్లాలో ఈ ఏడాది 23,410 హెక్టార్లలో మిర్చి పంట సాగు చేశారు. జిల్లాలోని ఖమ్మం, కూసుమంచి, మధిర, వైరా వ్యవసాయ డివిజన్లలో పంటను విస్తారంగా సాగు చేశారు. సత్తుపల్లి వ్యవసాయ డివిజన్‌లో మాత్రం సాగు తక్కువగా ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరస్ తెగుళ్లు ఆశించి పంటకు నష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. దీంతో సాగుకయ్యే కనీస పెట్టుబడులు పూడకపోగా.. ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేల మేరకు రైతులు నష్టపోయారు. ఇక కౌలు రైతులు మరో రూ.20వేల మేర నష్టాలను చవిచూస్తున్నారు. పండిన పంటకు కూడా ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబమంతా ఆరుగాలం శ్రమించినా ఎకరాకు మరో రూ.15వేల మేర నష్టం జరిగింది.ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 19,828 హెక్టార్లు కాగా.. అంతకుమించి 23,410 హెక్టార్లలో పంట సాగు చేశారు. గత ఏడాది 19,605 హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 5వేల హెక్టార్లలో అదనంగా పంట సాగు చేశారు. ఇతర పంటల కంటే మిర్చి పంట ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనతో రైతులు మిర్చి సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.అనుకూలించని వర్షాలు, తుపాన్లు, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మిర్చి పంటకు తీరని నష్టం జరిగింది. వర్షాల కారణంగా గాలిలో తేమశాతం పెరగడంతో పంట తెగుళ్ల బారినపడింది. ఆగస్టు, డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన వర్షాలు, తుపాన్లు పంటకు ప్రతికూలంగా మారాయి. ప్రధానంగా తోటలకు జెమినీ వైరస్ సోకింది. దీనిని కొంత మేరకు నియంత్రించుకోవడం తప్ప పూర్తి పరిష్కారం లేదు. దీనికి తోడు ఎండు తెగులు ఆశించింది. తెగుళ్ల నివారణకు రైతులు మందులను మార్చిమార్చి పిచికారీ చేశారు. గుంటూరు నుంచి మందులు తెచ్చి వినియోగించినా ఫలితం కనిపించలేదు. తెగుళ్ల కారణంగా పైరు ఆశించిన రీతిలో లేదు. దిగుబడులపై గణనీయంగా ప్రభావం పడింది.ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల జిల్లాలో సగటున ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నల్లరేగడి నేలల్లో మిర్చి గుంటకు క్వింటా చొప్పున 40 గుంటల భూమిలో 40 క్వింటాళ్ల పంట పండుతోంది. అయితే ఇక్కడి భూములు వివిధ రకాలుగా ఉండడంతో మిర్చి ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల మేరకు దిగుబడులు వస్తాయి. అయితే ఈ ఏడాది కనీస దిగుబడులు కూడా రాలేదు.మిర్చి సాగుకు ఎకరాకు నారు పోసింది మొదలు పంటను మార్కెట్‌కు చేర్చి.. విక్రయించే వరకు రూ.1.10లక్షల నుంచి రూ.1.20లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ ఏడాది ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత ధర క్వింటాల్‌కు సగటున రూ.7,500 వరకు పలుకుతోంది. అంటే ఎకరాకు పంట అమ్మితే రూ.52,500 వస్తున్నాయి. ఎకరాకు దాదాపు రూ.50వేల నుంచి రూ.60వేల మేరకు రైతు పెట్టుబడి నష్టపోతున్నాడు. ఇక కౌలు రైతు పరిస్థితి మరీ దయనీయం. ఈ రైతులు కౌలు మరో రూ.20వేల మేరకు నష్టపోతున్నారు. ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడులు కూడా పూడక తల పట్టుకున్నారు.