
యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
మనిషికి ఊపిరి *ప్రాణ శక్తి.*
కష్టించి పనిచేయటానికి తోడ్పడేది *దేహశక్తి.*
సన్మార్గంలో నడిపించేది *బుద్ధి శక్తి.*
సమస్యలకు ఎదురొడ్డేది (ఎదిరించేది) *ధీశక్తి.*
శక్తి ఉంటేనే మనిషి జీవితంలో నిలవగలడు, గెలవగలడు.
*శక్తి- ఐశ్వర్యం, ప్రకాశం అనే రెండు అంశాల కలయిక.*
అది అదృశ్య, అనిర్వచనీయ తత్వం.
*శక్తి ఉనికిని గ్రహించి, అవసరాలకు అనుగుణంగా వినియోగించటంలో మనిషి సిద్ధహస్తుడు.*
పుట్టుకతోనే మనిషి శక్తిమంతుడు.
*ప్రకృతి తన శక్తులు అన్నీ మనిషికి ధారపోసింది.*
మనిషి బుర్రలో *సంకల్పాలు పుట్టించి, సాధించే ప్రయత్నానికి పురిగొల్పేది ఇచ్ఛాశక్తి.*
*సమర్థత, కార్యదక్షత ప్రసాదించేది క్రియాశక్తి.*
*విషయ పరిజ్ఞానం, తార్కిక భావాలను అందించేది జ్ఞానశక్తి.*
ప్రకృతి ప్రసాదించిన ఈ *శక్తుల పూర్తి సద్వినియోగానికి, మనిషి మనోచాంచల్యాలను అధిగమించాలి.*
*సత్వ, రజో, తమో గుణాలకు మనిషి మనసు బందీ.*
*ఇంద్రియలోలత్వమే తమోగుణం.*
*‘ఏదో సాధించాలి’ అనేది రాజసం- రజోగుణం* అంటారు.
*శాంతి, దయ, బ్రాహ్మీ భావనలే సత్వగుణం.*
మనిషిలోని *ఇచ్ఛ క్రియ జ్ఞాన శక్తులే, సత్వ రజో తమో గుణాలను దాటించగలవు. త్రిగుణాతీత పరబ్రహ్మానికి చేర్చగలవు.*
*నిద్రాణమైన ఈ శక్తులను సులభ్యం చేసే మార్గం శక్తి ఆరాధన.*
*ప్రకృతిని శక్తిగా, పురుషుని శివంగా భావించి, శక్తిని విశేషంగా ఆరాధించటమే శక్తిపూజ (శాక్తేయం).*
*శివశక్తుల సంయోగమే సృష్టి.*
*శక్తి లేనిదే, శివం జడం అవుతుంది. శివం లేనిదే, శక్తికి ఉనికి ఉండదు.*
ఇదే శివ-శక్తుల ఏకత్వం.
*ఏకమై ప్రకాశించే శివశక్తుల అన్యోన్య అవిభాజ్య బంధాన్ని, భాషకు-భావానికి ఉన్న సంబంధంగా పోల్చాడు మహాకవి కాళిదాసు.*
శివశక్తుల సగుణ రూపాలే- పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్యగర్భులు.
*సృష్టి ఆరంభంలో శివశక్తి మూలప్రకృతిగా ఆవిర్భవించింది అంటుంది వేదం.*
*ప్రకృతి రెండు విధాలు-పరా, అపరా.*
*సర్వ జీవుల్లో ప్రాణరూపంగా ఉన్న చేతన శక్తిని పరాప్రకృతి.*
*పంచభూతాలు, ఇంద్రియ సమూహము, మనోబుద్ధులు అపరా ప్రకృతి.*
దీనినే *అచేతన శక్తి, జడ ప్రకృతి* అంటారు.
*సర్వప్రాణుల ఉత్పత్తికి ‘జడ-చేతన’ ప్రకృతి శక్తుల సంయోగమే కారణం.*
దీనినే *పంచీకరణ* అంటారు.
పంచీకరణ ద్వారా జనించిన అనేక జీవులలో, మానవ జన్మకు విశిష్ఠత ఉంది.
మిగిలిన ప్రాణులకు భిన్నంగా మనిషి మాత్రమే పరిపూర్ణ సృష్టి.
*వివేకం, విచక్షణ, స్వేచ్ఛ, బుద్ధివికాసం, తార్కిక దృష్టి, తాత్విక చింతన, జ్ఞానతృష్ణ, ఆత్మస్పురణ వంటి మేథో సంపదలు మనిషికి మాత్రమే ప్రకృతి ప్రసాదించింది.*
*‘మానవజన్మ వ్యర్థం కారాదు’* అంటుంది దేవి భాగవతం.
మానవ జన్మ ఔన్నత్యం, శక్తి పూజా విధానం, దేవీ అవతారాల గురించి దేవి భాగవతం విశదీకరిస్తుంది.
*శక్తి స్వరూపాలుగా స్త్రీ దేవతామూర్తులను అర్చించటమే శక్తి ఆరాధన.*
శక్తితత్వాన్ని భక్తులకు బోధించిన వారిలో అగ్రగణ్యులు రామకృష్ణ పరమహంస.
*జగన్మాత శక్తి స్వరూపం, ఆ తల్లిని అర్చిస్తే శక్తిమంతుడవై దైవంతో సరిసమానంగా భాసించగలవు* అనేది వీరి ప్రబోధం.
‘అష్టాదశ శక్తి పీఠాలు నీలోనే వెలుగుతున్నాయి.
*నీలోని ఇచ్ఛా, క్రియ, జ్ఞాన శక్తులే ‘కాళి, లక్ష్మీ, సరస్వతులు’ అంటారు కంచి పరమాచార్యులు.*
హనుమ- *తన శక్తిని పూర్ణంగా గ్రహించిన మరుక్షణం* సముద్రాన్ని అలవోకగా దాటాడు.
రామకార్యం సఫలం చేశాడు. రుద్రావతారుడిగా కీర్తి గడించాడు. మనిషి తన దివ్య శక్తులను పూర్ణంగా గ్రహించాలి. *సాధన ద్వారా అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఉత్తమకార్యాలు సాకారం* అవుతాయి. *దైవానికి చేరువకాగలడు.*