యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తమిళనాడులో అన్నాడీఎంకే, పాట్టాలీ మక్కల్ కాచీ (పీఎంకే) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటుపై కూడా ఆ పార్టీలు ప్రకటన చేశాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పీఎంకే ఏడు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వారు వెల్లడించారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఈ ఇరు పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. అన్నాడీఎంకే నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పీఎంకే నేతలు ఎస్.రామదాస్, జీకే మణి మంగళవారం చర్చలు జరిపారు. అనంతరం పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ... ‘ఉప ఎన్నికలు జరగనున్న 21 అసెంబ్లీ స్థానాల్లోనూ అన్నాడీఎంకేకి పీఎంకే మద్దతు తెలుపనుంది. పీఎంకేకి ఓ రాజ్యసభ సీటు ఇవ్వనున్నాం’ అని ప్రకటించారు.చర్చల సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పీఎంకే పెట్టిన పలు షరతులకు అన్నాడీఎంకే అంగీకరించింది. ‘ఈ డిమాండ్లు తమిళనాడు హక్కులకు సంబంధించినవి. ఇరు పార్టీలు వాటిని ఒప్పుకున్నాయి. దీంతో మేము కూటమిని ఏర్పాటు చేశాము’ అని పీఎంకే నేత రామదాస్ తెలిపారు. ఈ ఇరు పార్టీలు కలిసి 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేశాయి. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి. ప్రస్తుతం అన్నాడీఎంకేకి లోక్‌సభలో మొత్తం కలిపి 37 సీట్లు ఉండగా, పీఎంకేకి ఒక సీటు ఉంది. కాగా, ఈ కూటమిలో భాజపా కూడా చేరే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం అన్నాడీఎంకే నేతలతో భాజపా అగ్రనేతలు చర్చించనున్నారు. అనంతరం పొత్తుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.