యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికలెప్పుడు జరిగినా హోరాహోరీగా నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి సీటు కూడా ఒకటి. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ఈ నియోజకవర్గంలో ఈసారి కూడా గట్టి పోటీ నెలకొనే అవకాశం మెండుగా ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సమీప వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై 7,583 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి కూడా పోరు హోరాహోరీగానే సాగేట్లు కనబడుతోంది. అయితే గోపాల కృష్ణారెడ్డికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అదే నియోజకవర్గం టికెట్‌ను ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డికి ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఇదే టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ఎన్పీవీ. నాయుడు కూడా ఆశిస్తున్నారు. ఈ సారి చంద్రబాబు తప్పక తనపై కరుణ చూపుతారని చెప్పుకుంటూ ఆయన సొంతంగా నియోజకవర్గంలో కార్యకర్తలతో ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. ఎక్కువగా కార్యకర్తలతో కలసి నిత్యం ప్రజా క్షేత్రంలోనే ఉండేందుకే ఆయన ఇష్టపడుతుంటారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో దిట్ట అని పేరుంది. సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ వారినే ప్రచార కర్తలుగా మార్చి అర్హులైన వారందరికీ పథకాలను సద్వినియోగం చేస్తారని చంద్రబాబు సైతం పలుమార్లు మెచ్చుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఈసారి ఆయన పోటీకి నిలబడకపోవచ్చన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందుకే ఆయనకు బదులుగా కొడుకు సుధీర్‌రెడ్డికి టికెట్ కోరుతున్నారని వినికిడి. అయితే ఇందులో పూర్తి స్పష్టత మాత్రం లేదు. వైసీపీ విషయానికి గత ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లతో విజయం చేజారిందని…ఈ సారి ఎలాగైన ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలని వైసీపీ అభ్యర్థిగా ఖరారైన మధుసూదన్‌రెడ్డి రెడీ అవుతున్నారు. అభ్యర్థిత్వం కూడా ముందే ఖరారవడంతో నిత్యం జనంలో తిరిగి హడావుడి చేస్తున్నారు. పోయిన సారి ఓడించిన ప్రజలే…ఈ సారి సానుభూతితో తనను గెలిపిస్తారని ధీమాతో ఉన్నారు. గత నాలుగేళ్లుగా ఆయన నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు. చివర్లో ఏదైనా సమీకరణలు మారడం, ఎవ్వరూ ఊహించని వ్యక్తులు వైసీపీలో చేరితే ఇక్కడ మధుసూదన్‌రెడ్డిని జగన్ పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారన్నది కూడా చూడాలి. బీజేపీ నుంచి శ్రీకాళహస్తి ఆలయం మాజీ చైర్మన్‌గా పనిచేసిన కోలా ఆనంద్ బరిలో దిగుతున్నారు. పార్టీకి బలం లేకపోయిన సొంతంగా కొంత ఓటు బ్యాంకు అయితే కలిగి ఉన్నారు. గెలుపోటములను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉంది. ఇక జనసేనకయితే ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు కాలేదు. కాపుల ఓట్లు ఉన్నా ఇక్కడ పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనది రాజకీయ వర్గాల విశ్లేషణ. ప్రధానంగా వైసీపీ -టీడీపీల మధ్యే పోరు కొనసాగనుంది