YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏలేరు కాల్వ పూడికతో నీటి ఇక్కట్లు

ఏలేరు కాల్వ పూడికతో నీటి ఇక్కట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

విశాఖ నగర తాగు, పారిశ్రామిక అవసరాలు కు కటకట తప్పేలా లేదు. నీటి అవసరాల కోసం  ఉద్దేశించిన ఏలేరు కాలువ సామర్ధ్యం గణనీయంగా పడిపోయింది.ఏలేరు కాలువలో పేరుకుపోయిన పూడికతో ప్రతి ఏటా నీటి ఇక్కట్లు తప్పట్లేదు.  కాలువ నిర్మాణ సమయంలో 700 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం తరలిస్తున్నది కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే. ప్రస్తుతం నగరానికి ఏలేరు కాలువ ద్వారా 55 నుంచి 60 మిలియన్ గేలన్స్ పర్‌ఎడే ల నీరు మాత్రమే అందుతోంది. దీనిలో 35 ఎంజిడిలు స్టీల్‌ప్లాంట్‌కు, మరో 8 ఎంజిడిలు ఎన్‌టిపిసి, మరో 3 ఎంజిడిలు ఎపిఐఐసికి కేటాయించగా, మిగిలిన నీటిని మాత్రమే నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నారు. అది కూడా వేసవి వచ్చిందంటే సగానికి పడిపోతోంది. ఏలేరు కాలువ ద్వారా తూర్పు గోదావరి, విశాఖ మెట్టప్రాంత రైతాంగానికి సాగునీరు కూడా ఇవ్వాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రైతులు తమ వాటా నీటిని వాడుకోగా, విశాఖ వచ్చే నీరు పూర్తి స్థాయిలో చేరట్లేదు. అందుకు ప్రధాన కారణం పూడిక పేరుకుపోవడమే. గత కొనే్నళ్లుగా కాలువ మరమ్మతుల నిమిత్తం ఒక్కోసారి కాలువ పనులు చేపడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్వహణ మాత్రం చేపట్టిన దాఖలాల్లేవు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూడిక తీసేందుకు ప్రతిపాదనలు అందజేసింది. అయితే ఖర్చు ఎక్కువగా భావించిన జివిఎంసి, విస్కో డిసిఐ ప్రతిపాదనను పక్కనపెట్టేశాయి. కాలువ నిర్వహణ, పూడికతీత వంటి పనుల ఆర్థికంగా తరచు భారంగా మారుతున్నాయని భావించి కాలువ స్థానే పైప్‌లైన్ వేయాలని భావించారు. దీనికి సంబందించి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. కాలువ పొడవు 150 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేసేందుకు దాదాపు రూ.1300 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ ప్రతిపాదన కూడా విరమించుకున్నారు.పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని విశాఖ తరలించేందుకు నిర్ణయించారు. 1300 క్యూసెక్కుల నీటిని ఈ కాలువ ద్వారా విశాఖ తరలించే అవకాశం ఉంది. అయితే ఎడమ కాలువ నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందని భావించిన ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతలను నవంబర్ నాటికి పూర్తి చేసి ప్రస్తుతం ఉన్న ఏలేరు కాలువ ద్వారానే నీటిని తరలించాలని భావిస్తోంది. తొలి దశలో 300 క్యూసెక్కుల నీటిని ఏలేరు కాలువ ద్వారా విశాఖ తరలించాలన్నది లక్ష్యం. అయితే కాలువ సామర్ధ్యం మాత్రం అందుకు ఎంత మాత్రం సరిపోదన్నది నిపుణల అంచనా. ఏలేరు కాలువకు తాత్కాలికంగా మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టాలని జివిఎంసి నిర్ణయించింది. దీనికి రూ.30కోట్లు ఖర్చవుతాయని అంచనా. అంత మొత్తం ఖర్చు చేయడం కూడా కష్టమని భావించిన అధికారులు రూ.5 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. దీనివల్ల కాలువ సామర్ధ్యం కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. ఏలేరు కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించాలన్న నిర్ణయం మాత్రం సహేతుకంగా లేదని నిపుణులు భావిస్తున్నారు.

Related Posts