YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ కు తోడల్లుడు టెన్షన్

లోకేష్ కు తోడల్లుడు టెన్షన్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:    

నిన్నటి వరకూ ఆ యువకుడు విశాఖలో ఎవరికీ తెలియదు. అతి కొద్ది మందికి మాత్రం సినీ నటుడు బాలక్రిష్ణ అల్లుడిగా పరిచయం. హఠాత్తుగా సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి చనిపోవడంతో ఆయన మనవడుగా జనాలకు తెలిసింది. ఇక విశాఖలో మూర్తి స్థాపించిన గీతం విద్యా సంస్థలకు సహజంగానే చైర్మన్ అయిపోయారు. అంతవరకూ బాగానే ఉంది కానీ మూర్తి రెండు మార్లు ఎంపీ అయిన విశాఖ సీటు కూడా తనకు వారసత్వం అంటూ శ్రీ భరత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. నిన్నటి వరకూ పెద్దగా కనిపించని శ్రీ భరత్ ఇపుడు పెద్ద హోర్డింగులు పెట్టి మరీ విశాఖ సిటీలో హల్ చల్ చేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ చాప కింద నీరుగా పనిచేసుకునిపోతున్నారు. తనకే సీటు గ్యారంటీ అని లేటెస్ట్ గా మీడియా ముందుకు వచ్చి ఒకటికి రెండు మార్లు చెప్పడం బట్టి చూస్తే విశాఖ ఎంపీ టికెట్ కోసం శ్రీ భరత్ బాగానే ట్రై చేస్తున్నారని అర్ధమవుతోంది.టీడీపీలో శ్రీ భరత్ కి రాజకీయం హాట్ కేక్ కాదని అంటున్నారు. నిజానికి పార్టీలో ఎవరికీ లేనంత చనువు, బంధుత్వం అన్నీ శ్రీ భరత్ కి ఉన్నా ఇపుడవే అడ్డంకి గా మారాయని మరో వైపు ప్రచారం సాగుతోంది. శ్రీ భరత్ టికెట్ కి టిక్కు పెట్టేందుకు తెర వెనక రాజకీయం కూడా అంతే స్పీడ్ గా సాగుతోందని చెబుతున్నారు. శ్రీ భరత్ లోకేష్ కి స్వయాన తోడల్లుడు. ఈ ఒక్క అంశమే శ్రీ భరత్ రాజకీయాన్ని మార్చెస్తోందని కూడా టాక్ వస్తోంది. శ్రీ భరత్ కి ఎంపీ టికెట్ ఇచ్చి టీడీపీలో ప్రోత్సహిస్తే ఆయన రేపటి రోజున పార్టీలో రెండో పవర్ సెంటర్ గా మారుతారన్న ఆలోచన కూడా పార్టీ పెద్దల్లో కలుగుతోందంట. నిజానికి టీడీపీకి అల్లుళ్ళు, తోడల్లుళ్ల రాజకీయం ఎపుడూ అచ్చిరాలేదు. అప్పట్లో అన్న గారి జమానాలో చంద్రబాబు దగ్గుబాటి తోడల్లుళుగా ఉంటూ పార్టీలో ఎన్ని వర్గాలతో చిచ్చు పెట్టాలో అన్నీ పెట్టేశారు. శ్రీ భరత్ ని సైడ్ చేసేందుకా అన్నట్టుగా మంత్రి గంటా శ్రీనివాసరావుని లేటెస్ట్ గా తెర మీదకు తెస్తున్నారు. భీమిలీ నుంచి పోటీ చేస్తానని అంటున్న గంటాను అక్కడ తప్పించి విశాఖ ఎంపీ సీటుకు పోటీ పెట్టాలనుకుంటున్నారు. గంటాకు ఇష్టం లేకపోయినా అధినాయకత్వం ఎక్కడ నుంచి పోటీ అంటే తాను రెడీ అంటున్నారు. తాజాగా మారుతున్న ఈ సమీకరణలతో శ్రీ భరత్ టికెట్ అవకాశాలు బాగా తగ్గిపోతాయని అంటున్నారు. అంతే కాకుండా శ్రి భరత్ మామ అయిన బాలయ్యకు కూడా టికెట్ ఇస్తే ఒకే కుటుంబంలో ఎక్కువమందికి చాన్స్ ఇవ్వలేమని చెప్పడానికి కూడా శ్రీ భరత్ ని తప్పించవచ్చు అని అంటున్నారు. మొత్తానికి ముప్పయ్యేళ్ళ వయసు, మూడు నెలల రాజకీయంతో ఏకంగా విశాఖ లాంటి హాట్ సీటును పట్టేద్దామని సంబరపడుతున్న శ్రీ భరత్ కి ఇప్పటీకైతే రెడ్ సిగ్నలే అంటున్నారు.

Related Posts