యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు అత్యంత సన్నిహితుడైన నితిన్ గడ్కరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఢిల్లీ రాజకీయాల్లో ప్రతి ఒక్కరి నోటా ఆయన పేరు మార్మోగిపోతోంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవి సొంత పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. అదే సమయంలో విపక్షాలకు అమృతంలా కన్పిస్తున్నాయి. వీనుల విందు చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో పార్టీలో వారు ఆడింది ఆట.. పాడింది పాట. వారి నాయకత్వాన్ని ప్రశ్నించే సాహసం ఏ నాయకుడూ చేయలేదు. శతృఘ్నసిన్హా, యశ్వంత్ సిన్హా వంటి సీనియర్లు మొదటి నుంచి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ పెద్దగా వాటికి ప్రాధాన్యం లేదు. ఈనేపథ్యంలో పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్ అయిన గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ మహారాష్ట్ర నాయకుడు బలమైన నేత. ఆర్ఎస్ఎస్ పునాదులు బలంగా ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం గల నాగపూర్ నుంచి లోక్ సభకు ఎన్నికైన నాయకుడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విలాస్ ముత్తెంవార్ ను మంచి మెజారిటీతో ఓడించిన బలమైన నాయకుడు గడ్కరీ. వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోతే మోదీ బదులు రాజీ అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యుడైన గడ్కరీ పేరును తెరపైకి తీసుకురావాలని పార్టీతో పాటు మిత్రపక్షమైన శివసేన ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆయనకేంద్ర బిందువుగా మారారు.ఒక్కసారి గడ్కరీ వ్యాఖ్యలను పరిశీలిస్తే మోదీ, షా నాయకత్వాలను సూటిగా ప్రశ్నిస్తున్నట్లే కనపడుతుంది. ఇటీవల మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం నేపథ్యంలో ‘‘పార్టీలోని కొందరు వ్యక్తులు తక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అనడం అగ్రనేతలను దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను ప్రధాని మోదీ తరచూ విమర్శించడాన్ని గడ్కరీ తప్పుపడుతున్నారు. ప్రతి ఒక్కరూ సమస్యను సృష్టించకుండా ఉంటే సగానికి పైగా సమస్యలు పరిష్కారమవుతాయని నెహ్రూ నమ్మేవారని గడ్కరీ పేర్కొనడం ప్రధాని మోదీని ఉద్దేశించినవే. తొలి ప్రధానిని తరచూ విమర్శించడం తగదని పరోక్షంగా చెప్పడమే అవుతుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ‘‘డిక్టేటర్’’ అని వ్యాఖ్యానించడాన్ని కూడా గడ్కరీ తప్పుపట్టారు. ఎలాంటి కోటా లేకుండానే ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ఒక వ్యక్తిని శక్తి సామర్థ్యాల ప్రాతిపదికన అంచనా వేయలేమని, అంతే తప్ప కులాలు, మతం ప్రాతిపదికగా కాదని పేర్కొనడం పరోక్షంగా అమిత్ షాను విమర్శించడమే అవుతుంది. నాగ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలోఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రధాని మోదీని ఉద్దేశించి పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటిని చక్కదిద్దుకోలేని వ్యక్తి దేశానికి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. ‘‘ముందు ఇంటిని చక్కదిద్దుకోండి. తర్వాత దేశ సేవ గురించి ఆలోచించండి’’ అని వ్యాఖ్యానించారు. ఈనెల 2న నాగ్ పూర్ లో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సమావేశంలో చేసిన ఈవ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవేనని వేరే చెప్పనక్కరలేదు. మోదీ తన భార్య యశోదాబెన్ కు దూరంగా ఉండటాన్ని గురించి చేసిన విమర్శలు ఇవి. ఈ స్థాయి విమర్శలు పార్టీలోని ఆషామాషీ నాయకుడు చేయలేదు. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అండదండలు లేకుండా ఇంత తీవ్రమైన విమర్శలు చేయలేరు. ఈ నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యల వెనక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందన్న వాదన వినపడుతోంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన గడ్కరీ రాజకీయ ప్రస్థానం ఆర్ఎస్ఎస్ లోనే ప్రారంభమైంది. విదర్భకు కేంద్రం నాగ్ పూర్. కొంతకాలం ఎమ్మెల్సీగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ముంబయి లో అనేక ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. 2009 లోక్ సభ ఎన్నికల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో పార్టీ విజయం అనంతరం రవాణా, జాతీయ రహదారుల మంత్రిగా నియమితులయ్యారు. గతంలో దేశవ్యాప్తంగా రోజుకు రెండుకిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులు నిర్మితమయ్యేవి. ఆయన హయాంలో అది 21 కిలోమీటర్లకు పెరిగింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గద్కరీ మహారాష్ట్ర లో చక్కెర మిల్లుల సారథి. ఆయన సారథ్యంలో ‘‘పూర్తి గావ్’’ విజయవంతంగా నడుస్తోంది. ఆ అనుభవంతో నే దేశ సారథ్యానికి కూడా బాటలు వేసుకుంటున్నారు.