యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఆయన తనయుడు బాలకృష్ణ రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రను ఆయనే స్వయంగా పోషించి ఈ చిత్రాలను నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలై ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన చిత్రం ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ జీవితం ‘మహానాయకుడు’గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. అసలే తొలి భాగానికి కలెక్షన్లు అంతంతమాత్రంగా రావడంతో రెండో భాగాన్ని మాత్రం ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఒక ప్రోమో వీడియోను, చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి మేకోవర్ వీడియోను విడుదల చేశారు. ఎన్టీఆర్, ఆయన సతీమణి బసవతారకం పాత్రలు పోషించిన బాలకృష్ణ, విద్యాబాలన్‌లతో కూడిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఆమె అనారోగ్యానికి గురైన సమయానికి సంబంధించిన సన్నివేశాలతో కూడిన ప్రోమో అది. అయితే, నారా చంద్రబాబు నాయుడిగా దగ్గుబాటి రానాను మార్చిన మేకోవర్ వీడియో మరింత ఆసక్తికరంగా ఉంది. ఆయనకు మేకప్ ఎలా వేశారు? చంద్రబాబు మేనరిజంను చూపించడానికి రానా ఎంత కష్టపడ్డారు? వంటి అంశాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. చంద్రబాబుగా రానా పర్ఫెక్ట్‌గా సరిపోయాడని అంటున్నారు. విలన్ పాత్రలు చేయడంలో రానా ది బెస్ట్ అని మరోసారి నిరూపించాడని కొంత మంది కామెంట్లు పెడుతున్నారు.