YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

మేము ఉగ్రబాధితులమే : ఇమ్రాన్

 మేము ఉగ్రబాధితులమే : ఇమ్రాన్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   
పుల్వామా ఉగ్రదాడిపై నాలుగు రోజుల అనంతరం స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి విషయంలో భారత్ తమపై అసత్య ప్రచారం చేస్తోందని, ఈ నెపంతో తమపై దాడికి దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని ఇమ్రాన్ హెచ్చరించాడు. ఉగ్రదాడితో తమకెలాంటి సంబంధం లేదని, ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వదని, తాము కూడా ఉగ్రవాద బాధితులేమంటూ మొసలి కన్నీరు కార్చారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. పాక్ సైన్యం చేతిలో ఇమ్రాన్ కీలు బొమ్మని, వారి సూచనలతోనే పుల్వామా ఉగ్రదాడి గురించి స్పందించారని ప్రధానిపై అదునుచూసి ఆమె గుగ్లీ సంధించింది. ఇమ్రాన్ ఏం మాట్లాడాలన్నా సైన్యం వైపు చూస్తారని, వారి ఆదేశాలు లేనిదే ఏమీ మాట్లాడలేరని విమర్శించారు. కొన్ని సిద్ధాంతాలు, అంశాల్లో రాజీపడడం ద్వారానే ఆయన అధికారంలోకి వచ్చారని రెహామ్ ఖాన్ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలో అనేక మతోన్మాద పార్టీలు పుట్టుకొచ్చాయని, వీటి వల్ల పాక్‌లో హింసాత్మక, మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని, దీని ఇమ్రాన్ తనకు అనుకూలంగా మలచుకున్నాడని రెహామ్ వ్యాఖ్యానించారు. సైన్యం అనుమతి లేనిదే ఏమీ మాట్లాడరని, పుల్వామా దాడిపై ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన కూడా ఈ కోవలోకే వస్తుందని ఆమె ధ్వజమెత్తారు. పుల్వామా దాడిపై తన స్పందన తెలపడానికి కూడా సైనికాధికారుల సూచనల కోసం వేచిచూశాడని దుమ్మెత్తిపోసింది. ప్రముఖ పాత్రికేయురాలిగా గుర్తింపు పొందిన రెహామ్ ఖాన్‌కు బ్రిటీష్ పౌరసత్వం ఉంది. ఇజాజ్ రెహ్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న రెహామ్ ఖాన్ 2005లో అతడి నుంచి విడిపోయారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో 2015లో వివాహం చేసుకున్నారు. అయితే, అదే పెళ్లి పెటాకులైంది. కేవలం 10 నెలలల్లోనే విడాకులు తీసుకుని ఎవరి దారిన వారు విడిపోయారు. ఇమ్రాన్ నుంచి విడిపోయే సమయంలోనూ ఆయనపై రెహామ్ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. తనను ఇమ్రాన్ వంటింటి కుందేలుగా మార్చాలని చూశాడని, బయటి వ్యక్తులతో తనను కలవనిచ్చేవారు కాదని ఆరోపించింది. తాజాగా పుల్వామా ఉగ్రదాడితో ఇమ్రాన్ ఖాన్ ఇరకాటంలో పడ్డ నేపథ్యంలో అదునుచూసి ఆయనపై విరుచుకుపడ్డారు. 

Related Posts