ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేరికతో చీరాల వైసీపీలో కొత్త పంచాయితీ మొదలయ్యింది. ఆమంచి రాకను వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ యడం బాలాజీ అధినేత జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. తనకు చెప్పకుండానే ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవడంపై మండిపడుతున్నారు. బుధవారం వైసీపీ అధినేతకు లేఖాస్త్రాన్ని సంధించిన బాలాజీ.. 9 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తే ఇచ్చే గౌరవం ఇదా అంటూ నిప్పులు చెరిగారు. ఆమంచి చేరికపై పునరాలోచించి.. తన లేఖపై స్పందించకుంటే వైసీపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తానంటూ హెచ్చరించారు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఆమంచి ఆగడాలు తట్టుకోలేక తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు బాలాజీ. ఎన్‌ఆర్‌ఐగా ఉన్న తాను అన్నీ వదులుకుని పార్టీకోసం పనిచేశానని గుర్తు చేశారు. వైసీపీలో క్రమశిక్షణగల కార్యకర్తగా ఆమంచి ఆకృత్యాలపై పోరాటం చేశానని.. ఈ పోరాటంలో తనపై కేసులు పెట్టినా వెనుకడగు వేయలేదన్నారు. ఆమంచి వంటి రౌడీని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా వినలేదని.. దుష్టశక్తులను పార్టీలో చేర్చుకున్నారంటే జగన్ అవినీతి కూడా నిజమనే భావన కలుగుతోందన్నారు. ఆమంచిని వైసీపీలో చేర్చుకునే ముందు కార్యకర్తల మనోభావాలను జగన్ పరిగణనలోకి తీసుకోలేదని.. కనీసం తనను సంప్రదించలేదని ఆరోపించారు యడం. ఆమంచి చేరికపై మాట్లాడేందుకు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు బాలాజీ. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని.. జగన్ చేసిన మోసానికి తన మనసు క్షోభిస్తోందన్నారు. తన లేఖకు జగన్ సమాధానం ఇవ్వాలని.. లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సర్వశక్తులూ ఒడ్డి ఆమంచిని ఓడిస్తానని చెప్పారు.