యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇటీవల అనేకమంది సైనిక కుటుంబాలకు కడుపుకోత మిగిల్చిన పుల్వామా ఉగ్రదాడిపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రొఫెసర్ అమితా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మంది భారత సైనికులను బలిగొన్న ఈ దాడికి జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీయే కారణమని ఆమె ఆరోపించారు. ప్రజా వాహనాలను నిలువరించే విషయంలో ముఫ్తీ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఫిబ్రవరి14 దాడి జరిగిందని పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రొఫెసర్ అమితా సింగ్ ట్విటర్లో స్పందిస్తూ..ఆర్‌డీఎక్స్ నింపిన వాహనాన్ని అధికారులు చెక్ చేసే అవకాశం లేకుండా మెహబూబా ముఫ్తీ ఆ మార్గంలోని మూడు చెక్ బ్యారియర్లను తొలగించారు. గవర్నర్ గారూ.. దయచేసి ఆమె తొలగించిన అన్నిటినీ మళ్లీ పునరుద్ధరించండి. 40 మంది సైనికులు చనిపోయారన్న బాధ నిజంగా మెహబూబా ముఫ్తీకి ఉంటే.. తన పొరపాటుకు పరిహారంగా 40 మంది తన మద్దతుదారులను బహిరంగంగా ఉరితీసేందుకు అప్పగించాలని పేర్కొన్నారు.కాగా అమిత్ సింగ్ వ్యాఖ్యలపై పీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. జేఎన్‌యూ ప్రొఫెసర్ కట్టుకథలు అల్లుతూ మెహబూబా ముఫ్తీపై హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆమె అంతటితో ఆగకుండా... కశ్మీరీలను బహిరంగంగా ఉరితీయాలని చెబుతున్నారు. ఆమెపై ఢిల్లీ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనిపై మేము ఆందోళన చేపడతాని ఆ పార్టీ ట్వీట్ చేసింది.మరోవైపు మెహబూబా ముఫ్తీ సైతం సదరు ప్రొఫెసర్‌పై తీవ్రస్థాయిలో స్పందించారు. ఉన్నత చదువులు చదివిన ఓ వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు. ఆమె నిజంగా చదువుకున్నారా. కశ్మీరీలను వేధించాలన్న ఉద్దేశ్యంతో ఆమె కావాలనే ఈ కట్టుకథలు అల్లుతున్నట్టు కనిపిస్తోంది.అని వ్యాఖ్యానించారు.