యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన స్థానాలపై బాగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఆ పార్టీ కంచుకోట హిందూపురం నియోజకవర్గంలో విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో జగన్ చేసిన ప్రయత్నం ఆ పార్టీకే ప్రతికూలంగా మారింది. తాజాగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాయి. అక్కడ టీడీపీని ఓడించాలనే ఉద్దేశ్యంతో అదే పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే హిందూపురం నుంచి ఆ పార్టీ తరపున 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ ఘనీ.. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ వద్దకు వెళ్లి, ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వెంటనే ఆ నియోజకవర్గానికి ఘనీని సమన్వయకర్తగా నియమించాడు వైసీపీ అధినేత. దీంతో ఆ పార్టీకి భారీ షాక్ తగలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నవీన్‌నిశ్చల్ తాజా పరిణామాలతో అసంతప్తిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బాలయ్య మీద పోటీ చేసిన నిశ్చల్ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పని చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్కడ ముఖ్య నేతగా ఎదిగిపోయారు. టికెట్ తనకే దక్కుతుందనుకునే సమయంలో అబ్ధుల్‌ఘనీని జగన్ వైసీపీలో చేర్చుకోవడమే కాకుండా సమన్వయకర్త బాధ్యతలు అప్పజెప్పారు.దీంతో నవీన్‌నిశ్చల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన తన అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వందల మంది వచ్చారు. తన రాజకీయ భవితవ్యంపై వారితో చర్చించినట్టు సమాచారం. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో హిందూపురం నియోజకవర్గ వైసీపీ సీటును తనకు కాకుండా మరొకరిని రంగంలోకి దించడంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిసింది. అయితే, అనుచరులందరూ రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే ఆయన వైసీపీని వీడబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే నవీన్.. టీడీపీ నేతలతో మంతనాలు కూడా జరిపారట. ఇదే జరిగితే వైసీపీకి అక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది.