యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వంగవీటి రాధాను ఫుల్లుగా ఉపయోగించుకోవాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వంగవీటి రాధా టీడీపీలో చేరుతున్నారని, ఆయన చేరిన తర్వాత రాధా చేత రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయించాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ను ఆశించి భంగపడ్డ వంగవీటి రాధా ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే దాదాపు నెలరోజుల నుంచి రాధా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఆయన ముఖ్య సన్నిహితులకు కూడా అందుబాటులో ఉండటం లేదు. అయితే ఇందుకు కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. వంగవీటి రాధా టీడీపీలో చేరడానికి రెండు డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచినట్లు చెబుతున్నారు. ఒకటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వడం కుదరకపోతే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నది. ఎమ్మెల్సీ పదవికి టీడీపీ ఒకే చెప్పింది. నాలుగైదు రోజుల్లో ఎమ్మెల్సీ పదవికి రాధాను టీడీపీ అధినాయకత్వం ఎంపిక చేయనుంది. అలాగే కృష్ణలంక ఇళ్లపట్టాల అంశం. దీనిపై ఇప్పటి వరకూ రాధాకు పార్టీ అధిష్టానం నుంచి రెస్పాన్స్ లేదు. దీంతో కృష్ణలంక ఇళ్ల పట్టాల విషయం తేల్చాలని రాధా టీడీపీ నేతలను మరోసారి కోరినట్లు తెలుస్తోంది.కృష్ణలంక ఇళ్లపట్టాల విషయంలో స్పష్టత వచ్చిన వెంటనే రాధా టీడీపీలో చేరతారన్నది ఆయన అనుచరుల నుంచి విన్పిస్తున్న మాట. తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలియడంతో రాధా, రంగా అనుచరుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమయింది. కాలమే పరిష్కరిస్తుందని రాధా ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయారని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు. టీడీపీలో చేరడం ఖాయమని, ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా కన్ఫర్మ్ అయిందనిచెబుతున్నారు. ఈ నెలలోనే రాధా టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. రాధా పార్టీలో చేరిన వెంటనే ఆయన చేత రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. వంగవీటిరంగా కుమారుడిగా కాపు సామాజిక వర్గంలో రాధాకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో ఉంటుండటంతో రాధాను ఫుల్లుగా వాడుకోవాలని టీడీపీ భావిస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాధా చేత బహిరంగ సభలను ఏర్పాటు చేసి కాపులకు వైసీపీలో జరుగుతున్న అన్యాయంతో పాటు, చంద్రబాబు కాపులకు చేసిన మేళ్లను కూడా వివరించాలని డిసైడ్ చేసింది. మరి రాధా ఆ స్థాయిలో కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.