యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో స్పీడ్ పెంచాల్సిన జనసేనాని ఎందుకు వేగం తగ్గించారు…? ఒకవైపు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ప్రజలు హామీలతో పాటు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాయి. కానీ జనసేనాని మాత్రం కామ్ గా ఉండటానికి కారణమేంటి? తన సామాజిక వర్గం నేతలు కూడా తనవైపు, తన పార్టీ కార్యాలయం గడప తొక్కకపోవడానికి కారణమేంటి?పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేయాలని వచ్చారు. ఆయన తన టార్గెట్ 2024 గా పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు. అయితే నిన్న మొన్నటి వరకూ పోరాట యాత్రల పేరుతో జిల్లాలను చుట్టి వచ్చిన పవన్ ఇప్పుడు ఇంటికో, కార్యాలయానికే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. పవన్ ఇప్పటి వరకూ ఐదు జిల్లాల్లో మాత్రమే పోరాట యాత్రను చేశారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఒకవైపు ఇతర పార్టీలనేతలకు కండువాలను కప్పుతూ, నిత్యం పార్టీని సందడిగా ఉంచుతున్నారు. మరోవైపు వైసీపీ అధినేత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు ఒక నేత చొప్పున పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీలో చేర్చుకుని తాను రేసులో ముందున్నారంటున్నారు జగన్. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ దూకుడు పెంచాల్సింది పోయి మౌనంగా ఉండటం పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతోంది.రెండు నెలలుగా కార్యాలయానికే పవన్ పరిమితమయ్యారు. జనవరినుంచి పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాల్లో పాలుపంచుకుంటానని చెప్పిన పవన్ ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఏమీ లేవనే చెప్పాలి. ఓటు వేయాలంటే ముందుగా పార్టీపై ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం లేకున్నా, పార్టీ అభ్యర్థి గెలవరని భావించినా ఎవరూ ఆ గుర్తుపై ఓటేసేందుకు ముందుకురారు. ఇప్పటి వరకూ ఏపీలోక్షేత్రస్థాయిలో బలం లేని జనసేనను ఎన్నికల నాటికి ఎలా ముందుకు తీసుకెళ్తారన్నప్రశ్న పార్టీలో తలెత్తుతోంది. కర్ణాటకలో మాదిరిగా తామే కింగ్ మేకర్ అవుతామని చెప్పిన పవన్ ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలేవీ లేవనే చెప్పాలి. మరి పవన్ జనసైనికుల ఆశలను ఏవిధంగా తీరుస్తారో చూడాల్సి ఉంది