యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జనసేన అధినేత పట్టున్న జిల్లా ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది తూర్పు గోదావరి జిల్లా మాత్రమే. అయితే తొలినాళ్లలో ఉన్న జనసేన హడావిడి ఇప్పుడు అక్కడ కన్పించడం లేదు. నేతల్లోనూ నైరాశ్యం కన్పిస్తోంది. గతంలో ప్రజారాజ్యానికి కూడా ఈ జిల్లా నుంచి నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కాయి. కాపు సామాజిక వర్గం బలంగా ఉండే ఈ జిల్లాలో పవన్ పార్టీ ఎవరిని దెబ్బతీస్తుందన్న చర్చ నిన్న మొన్నటి వరకూ జరిగేది. జనసేనలోకి అత్యధికంగా సీనియర్ నేతలు, పట్టున్న నేతలు వచ్చింది ఈ జిల్లా నుంచే కావడంతో పవన్ కూడా తూర్పు గోదావరి జిల్లాపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు.ఒకవైపు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గరపడుతున్న సయమంలో దూకుడు పెంచాయి. పవన్ ఈ జిల్లాలో బలంగా ఉంటారని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలు ప్రత్యేక దృష్టి పెట్టారు. అసలు జనసేనలో ఏం జరుగుతుందనేది నేతలకు సయితం అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన స్క్రీనింగ్ కమిటీకి తన దరఖాస్తును కూడా సమర్పించారు. పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నప్పటికీ ఇందులోనూ కొంత గందరగోళం నెలకొంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన వెంటనే తూర్పు గోదావరి జిల్లానేతలు పార్టీలోకి ఇబ్బడి ముబ్బడి గా చేరారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు ఇటీవల బీజేపీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ కూడా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. కానీ జనసేనలో ఇప్పుడు జోష్ కన్పించడం లేదు. పవన్ ప్లాన్ ఏంటో నేతలకు అంతుపట్టడం లేదు. టీడీపీ, వైసీపీలు దాదాపుగా జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేశాయనే చెప్పాలి. కానీ జనసేన మాత్రం ముమ్మడివరం నియోజకవర్గం తప్పించి ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు.తూర్పు గోదావరి జిల్లాపై పవన్ కల్యాణ్ కూడా గంపెడాశతో ఉన్నారు. గతంలో యనమల రామకృష్ణుడిని తుని నియోజకవర్గంలో ఓడించిన రాజా అశోక్ బాబు జనసేన నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పార్టీ పరిస్థితి చూసిన తర్వాత ఆయన ఆ యోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు. రాజా అశోక్ బాబు జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగడం లేదని ఆయన సన్నిహితులే చెబుతన్నారు. ఎక్కువ మంది ఈ జిల్లా నుంచి స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవడంతో పవన్ కు కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక కష్టమైంది. మరో వైపు జనసేనలో అనేక నియోజకవర్గాల్లో వర్గపోరు స్పష్టంగా కన్పిస్తోంది. దీంతో ఎవరికి వారే యమునాతీరే అన్న రీతిలో నేతలు ఉన్నారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా పవన్ ను వచ్చే ఎన్నికల్లో ఆదుకుంటుందా? లేదా? అన్నది సందేహమేననే చెప్పాలి.