యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు దర్శకుడు రామ్గోపాల్ వర్మ చురకలంటించారు. ఇటీవల జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇటీవల ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. పుల్వామా దాడికి తమను నిందించడం సరికాదని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తమపై ఆరోపణలు చేస్తోందని, సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలని తెలిపారు.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్.. చర్చలతోనే సమస్యలు పరిష్కారమయ్యేటట్లైతే.. మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని వ్యాఖ్యానించారు.
ఓ వ్యక్తి ఆర్డీఎక్స్ పట్టుకుని మావైపు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతనితో చర్చలు ఎలా జరపాలో మా భారతీయులకు నేర్పించండి సర్. నేర్పించినందుకు మీకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తాం సర్. మీ దేశంలో ఒకప్పుడు ఒసామా బిన్లాడెన్ ఉన్నాడని అమెరికాకు తెలిసినప్పుడు మీకెందుకు తెలీదు? కనీసం మీ దేశంలో ఎవరు ఉంటున్నారో కూడా తెలీనప్పుడు అదీ ఓ దేశమేనా? నాకు తెలీక అడుగుతున్నాను సర్.. ప్లీజ్ చెప్పండి. జైషే మహమ్మద్, లష్కరే, తాలిబన్, ఆల్ఖైదా సంస్థలు మీ ప్లే స్టేషన్స్ కాదని నాకు ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఆ సంస్థలకు వ్యతిరేకమని మీరూ ఎప్పుడూ చెప్పలేదు. మీకు బాంబులు క్రికెట్ బంతుల్లా కనిపిస్తున్నాయా సర్..’ అంటూ తనదైన శైలిలో పాక్ ప్రభుత్వానికి చురకలంటించారు వర్మ.