యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం రద్దు చేశారు.
పరదాలు విరాళం :
తిరుపతికి చెందిన నరసింహులు నాలుగు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ధనంజయులు, సహాయ కార్యనిర్వహణాధికారి లక్ష్మయ్య, సూపరింటెండెంట్ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ అనిల్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.