యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నెల్లూరు పర్యటనకోసం వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ లు ఘన స్వాగతం పలికారు. ముందుగా చెన్నైకు వెళ్లిన కోవింద్ అక్కడి నుంచి హెలికాప్టర్ లో నేరుగా నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానంలో దిగారు. తరువాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంటికి రాష్ట్రపతి వెళ్లారు. తరువాత *స్వర్ణభారత్ ట్రస్ట్* వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గ్రామీణ ప్రజల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడం ట్రస్టు లక్ష్యమన్నారు. సమాజంలో ఎవరు ఎంత ఎదిగినా అందుకు కారణమైన సమాజాభివృద్ధికి సేవ చేయాలని కోవింద్ సూచించారు. వెంకయ్యనాయుడు సొంత జిల్లాకు సేవలు చేయడం అభినందనీయమని తెలిపారు. రాజకీయాలలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. అజాత శత్రువుగా, సంప్రదాయాలకు విలువనిచ్చే అరుదైన నేత వెంకయ్య నాయుడు అని ఉపరాష్ట్రపతిని కొనియాడారు. ఢిల్లీలో ఉన్నప్పటికి గ్రామీణ సంస్కృతి సంప్రదాయానికి విలువిస్తూ.. పాటిస్తూ ఉండే వ్యక్తి వెంకయ్య నాయుడని రాష్ట్రపతి కోవింద్ కితాబిచ్చారు.