యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిన్న మొన్నటి దాకా భారతీయ జనతా పార్టీని అంటరాని పార్టీ గా చూసేవారు. ఇప్పుడు ఒక్కొరొక్కరూ దగ్గరవుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ కమలం పార్టీ మళ్లీ పంజుకుంటుందా? రానున్న లోక్ సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ స్థానాలను దక్కించుకోకపోయినా మిత్రులతో కలసి మళ్లీ మోదీ ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారా? ఇదే ప్రస్తుతం ఢిల్లీలో హాట్ హాట్ చర్చ. భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి కొంతకాలం క్రితం వరకూ మిత్రులంతా దూరమయిపోయారు. ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండటంతో ఆ పార్టీ దిగాలు పడిందనే చెప్పాలి. ఎక్కడ లోపం ఉందో అర్థం కాక ఒక దశలో కమలనాధులు తలలుపట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ, బీహార్ లోని ఆర్ఎస్ఎల్పీ, ఉత్తరప్రదేశ్ లోని అప్నాదళ్ పార్టీలు ఎన్టీఏ కూటమికి రాంరాం చెప్పడంతో మోదీ జట్టు పని అయిపోయిందనుకున్నారంతా.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కమలం పార్టీ స్పీడు పెంచింది. దీనికి ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ (యు) ఉపాధ్యక్షులు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణమంటున్నారు. వరుసగా పొత్తులు కుదుర్చుకుంటూ కాంగ్రెస్ కూటమికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కమలం పార్టీ. బీహార్ లో జనతాదళ్ యు, బీజేపీ ల మధ్య పొత్తు కుదరడానికి ప్రశాంత్ కిషోర్ కారణమని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇటు మోదీకి, అటు నితీష్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ఉండటం, ఎన్నికల లెక్కల్లో ఆరితేరిన వాడు కావడంతో బీహార్ డీల్ కుదిరిందన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.ఇక మహారాష్ట్రలో శివసేన కూడా తలొగ్గడానికి పీకేయే కారణమన్న వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రశాంత్ కిషోర్ శివసేనకు కూడా తన చేయి అందించాడు. ఈ నేపథ్యంలో అమిత్ షా, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ల మధ్య చర్చలు సఫలం కావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ కారణమని చెబుతున్నారు. ఉద్ధవ్ థాక్రేను ఒప్పించింది కూడా ప్రశాంత్ కిషోరేనని, విడివిడిగా పోటీ చేస్తే నష్టపోయే అంచనాలను కూడా పీకే థాక్రేకు అందించడంతో ఆయన పొత్తుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇక ఒడిశాలో బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ తో కూడా ప్రశాంత్ కిషోర్ టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఒడిశాలో ఇప్పటికే నవీన్ పట్నాయక్ తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఒడిశాలోని 21 పార్లమెంటు స్థానాల్లో బిజూ జనతాదళ్ పోటీ చేయనుంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అవతరించింది. ఈ నేపథ్యంలో అవగాహనతో బీజేపీ, బిజూ జనతాదళ్ పోటీ చేస్తాయన్న టాక్ పొలిటికల్ సర్కిళ్లలో బాగా నానుతోంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు అందరూ ఊహించిందే. బలహీనమైన పార్టీతో పొత్తు పెట్టుకుని ఏం లాభమని కొందరు ప్రశ్నించినా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తమిళనాడులో అలయన్స్ గా ఏర్పడ్డామన్నది కమలనాధుల అభిప్రాయం. ఇలా పాత మిత్రులు కొందరు దూరమైనా కొత్త మిత్రులను ఎన్నికలకు ముందు చేర్చుకుని ఒడ్డున పడాలన్నది కమలం పార్టీ వ్యూహంగా ఉంది. దీనికి ప్రశాంత్ కిషోర్ సహకారం పుష్కలంగా ఉంది