యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన పార్టీకి వచ్చే అవకాశాలున్న స్థానాల్లో తిరుపతి ఒకటి. తిరుపతి నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీకి వీరాభిమానులున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే సొంత నియోజకవర్గమైన పాలకొల్లు నుంచి ఓటమిపాలయిన చిరంజీని తిరుపతి ప్రజలు ఆశీర్వదించారు. ఇక్కడ చిరంజీవి గెలవడానికి అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం కూడా ఒక కారణమని అంగీకరించాల్సిన విషయం. అందుకే జనసేనలో ఈ సీటు హాట్ కేకు గా మారింది. టిక్కెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు.జనసేన తమకు గ్యారంటీగా వస్తాయనుకుంటున్న సీట్లలో తిరుపతి ఒకటి. ఇది పార్టీ వర్గాలు కూడా బహిరంగంగా చెబుతున్న విషయమే. అయితే టీడీపీలో సీనియర్ నేత చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరి ఆరు నెలలకు పైగానే అయింది. చదలవాడ చేరిన తొలినాళ్లలో ఆయనకే టిక్కెట్ అనుకున్నారు. అయితే జనసేన పార్టీలో చేరినా చదలవాడ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, పోటీకి విముఖత చూపుతుండటంతో చదలవాడను పక్కపెట్టినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదలవాడ కూడా టిక్కెట్ కోసం పెద్దగా ప్రయత్నించకపోవడమూ ఇందుకు నిదర్శనం.పార్టీలో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఈయన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. తిరుపతిలో కాపు, బలిజ సామాజిక వర్గాల ఓటర్లు అధికంగా ఉండటంతో ఈయన టిక్కెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. హరిప్రసాద్ నిజానికి కడప జిల్లా వాసి. ఆర్థోపెడిక్ సర్జన్ గా కొన్నేళ్ల క్రితం తిరుపతిలోనే స్థిరపడి పోవడంతో ఆయన తిరుపతి వాసులకు సుపరిచితం. గతంలో పవన్ కల్యాణ్ టీడీపీతో సఖ్యతగా ఉన్నప్పుడు ఆయన చేత సిఫార్సు చేయించుకుని టీటీడీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇటీవల ఆయన టిక్కెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈయన పేరును పవన్ కల్యాణ్ గట్టిగానే పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా ఉన్న కిరణ్ రాయల్ కూడా తిరుపతి టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 20 ఏళ్ల నుంచి మెగా ఫ్యామిలీతో టచ్ లో ఉంటున్నారు. మెగా స్టార్ పేరిట స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన చురుగ్గా వ్యవహరించారు. ఆర్థికంగా పెద్దగా బలంగా లేకపోయినా పవన్ కల్యాణ్ అభిమానుల కోటాలో తనకు సీటు దక్కుతుందని ఆశిస్తున్నారు. అయితే వీరిద్దరు కాకుండా నేరుగా జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నది ఇంకా డిసైడ్ కాకపోయినా ఆప్షన్లలో తిరుపతి ఒకటి ఉందని చెబుతున్నారు. మొత్తం మీద జనసేన తిరుపతి సీటు తమకు ఖాయమని నమ్ముతుండటంతో ఆ టిక్కెట్ కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు.