YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో కొలిక్కి రాని పొత్తు

కర్ణాటకలో కొలిక్కి రాని పొత్తు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       

అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులు కుదుర్చుకుంటోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సీట్ల ఒప్పందం ఒక కొలిక్కి వచ్చింది. దీంతో అక్కడ కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలసి ముందుకు వెళ్లనుంది. అయితే కర్ణాటకలో మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం సీట్ల పంపకాలపై తేల్చడం లేదు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా సర్కార్ కుప్ప కూలడం ఖాయం. ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగులు వేయాల్సిన రెండు పార్టీలూ పొత్తులపై ఎత్తులకు దిగుతుండటం ఆందోళనకర పరిణామమే.కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలుంటే అందులో 12 స్థానాలను జనతాదళ్ ఎస్ కోరుకుంటోంది. అయితే బలానికి తగ్గట్లుగానే సీట్లు ఉంటాయని ఇప్పటికే కాంగ్రెస్ పరోక్షంగా చెప్పేసింది. ముఖ్యమంత్రి కుమారస్వామి సయితం తాము సీట్లు అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదని ఒకింత తీవ్ర వ్యాఖ్యలే చేయడం విశేషం. ఒక దశలో కుమారస్వామి బీజేపీతో టచ్ లోకి వెళ్లారన్న ప్రచారమూ జరిగింది. రాష్ట్రంలో కేంద్రంలో ఒకరినొకరు సహకరించుకోవాలని బీజేపీ, జేడీఎస్ ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్న ప్రచారాన్ని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.దేవెగౌడ తన మనవళ్లను ఇద్దరినీ రాజకీయాల్లోకి ఈ ఎన్నికల ద్వారా తేదలచ్చుకున్నారు. పార్లమెంటులో తనతో పాటు మవనళ్లు కూడా ఉండాలన్నది ఆయన కోరిక. అయితే దేవెగౌడ మాండ్య, హాసన్, బెంగళూరు ఉత్తర నియోజకవర్గాలు ఆశిస్తున్నారు. హాసన్ నుంచి మనవడు ప్రజ్వల్, మాండ్య నుంచి మరో మనవడు నిఖిల్, బెంగళూరు ఉత్తరం నుంచి తాను పోటీ చేయాలన్నది ఆయన ఉద్దేశ్యం. అయితే ఈ మూడింటిలో బెంగళూరు ఉత్తర నియోజకవర్గం ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత చూపడం లేదు. కాంగ్రెస్ మాండ్యను కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మాండ్య లోక్ సభ స్థానం నుంచి ప్రముఖ సినీనటుడు, ఇటీవలే మరణించిన దివంగత అంబరీష్ భార్య, సినీనటి సుమలతను పోటీ చేయించాలని నిర్ణయించింది. నిజానికి మాండ్యలో జేడీఎస్ కు గట్టి పట్టుంది. అదే సమయంలో సుమలత అభ్యర్థి అయితే ఆ సీటు గ్యారంటీగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళుతుంది. సుమలత టిక్కెట్ ను జేడీఎస్ కాదనలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టిక్కెట్ల పంపకానికి ముందే కాంగ్రెస్, జేడీఎస్ లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. సిద్ధరామయ్య నేతృత్వంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లడం కూడా జేడీఎస్ కు ఇష్టంలేదు. ఈ పరిస్థితుల్లో పొత్తు కుదిరినా… రెండు పార్టీలూ క్షేత్రస్థాయిలో సహకరించుకునే పరిస్థితి లేదన్నది విశ్లేషకుల అంచనా.

Related Posts