యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాల్లో ఇద్దరూ సీనియర్లే. అనుభవం ఉన్నవారే. ఒకే పార్టీలో రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా గెలిచి సత్తా చాటారు. అయితే వీరిద్దరిలో ఒకరికి క్లారిటీ ఉంది కాని మరోనేత మాత్రం డోలాయమానంలో ఉన్నారు. వారే రాజమండ్రి, అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ లు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో వీరిద్దరి పయనమెటు? అన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ లో స్పష్టత ఉంది. ఆయన రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పిసినట్లే. హర్ష కుమార్ మాత్రం పోటీ చేయాలని తహతహ లాడుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి అన్నది ఇంకా స్పష్టత రాలేదు.ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లు 2004,2009 ఎన్నికల్లో పార్లమెంటు కు ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు పదేళ్లకే సందిగ్దంలో పడింది. ఉండవల్లిఅరుణ్ కుమార్ ఇప్పటికే తాను రాజీకీయాల్లో ఉండేది లేదని స్పష్టం చేశారు. ఆయన జనసేన, వైసీపీల మద్దతుదారుగా కన్పిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వరు. అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు పక్కా ఆధారాలతో సర్కార్ ను ఎండగడుతుండటమే ఇప్పుడు ఉండవల్లి చేస్తున్న పని. ఆయన సంధించే ప్రశ్నలకు అధికార పార్టీ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి.ఇక హర్షకుమార్ విషయానికొస్తే… ఆయన మరోసారి అమలాపురం పార్లమెంటునియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఏ పార్టీనుంచి అన్నది ఇంకా క్లారిటీ లేదు. తొలుత హర్షకుమార్ జనసేనలోకి వెళ్దామని భావించారు. ఇందుకు కార్యకర్తలతో కూడా చర్చించారు. తనకు అమలాపురం ఎంపీ టిక్కెట్, తన కుమారుడికి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను జనసేన ముందుంచారు. అయితే జనసేనాని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో హర్షకుమార్ జనసేనలో చేరే ఆలోచనను విరమించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో హర్షకుమార్ జనసేనలో చేరే అవకాశాలు దాదాపుగా లేనట్లే.తెలుగుదేశం పార్టీకి చెందిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీ వైపు కూడా హర్షకుమార్ చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తొలినుంచి తెలుగుదేశం పార్టీకి, హర్షకుమార్ కు పడదు. పైగా అమలాపురం పార్లమెంటు స్థానం బాలయోగి కుమారుడికి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేనని చెబుతున్నారు. దీంతో ఆయన టీడీపీలో చేరే అవకాశం లేదంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో హర్షకుమార్ లేరు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేక గ్రూపులో ఉన్న హర్షకుమార్ ఆయన తనయుడు పెట్టిన పార్టీలో చేరరంటున్నారు. మరి హర్షకుమార్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కరంగా మారింది.