యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నూలు జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న వైసీపీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేరాక తమకు ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, టికెట్ విషయంలో జగన్ హామీ ఇవ్వలేదని గౌరు వర్గం అలకబూనింది. గౌరు దంపతులు రెండ్రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న గౌరు ఫ్యామిలీ టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాటసాని పార్టీలో చేరిన సందర్భంలో మీకు పార్టీ టికెట్ దక్కుతుందా అని ఆమెను మీడియా ప్రశ్నించినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది.జగన్‌తో కొట్లాడైన పాణ్యం టికెట్ తెచ్చుకుంటామని వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో తమ కుటుంబానికి అంత చనువు ఉందని గౌరు చరిత తెలిపారు. అదే ధీమాతో ఎన్నికల ప్రచారం కూడా జోరుగా చేశారు. మరోపక్క పాణ్యం సీటుపై జగన్ తనకు హామీ ఇచ్చారని చెబుతూ కాటసాని కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాల మూలంగా తమకు ప్రాధాన్యం తగ్గిందని గౌరు దంపతులు మనస్తాపం చెందినట్లు తెలిసింది. దీంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం లేదని భావిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో ఈ పరిణామం వైసీపీని షాక్‌కు గురిచేసింది. ఇప్పటికే గత ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలుపొందిన భూమా కుటుంబం, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరడంతో పార్టీ బలహీనంగా మారింది. ఎన్నికల్లో వైసీపీ తరపున పాణ్యం నుంచి గౌరు వెంకట్ రెడ్డి సతీమణి గౌరు చరిత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తరువాత పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు అసంతృప్తితో ఉన్నారు. కాటసాని వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్ ఆశిస్తున్నారు. ఈ అంశంపైనే గౌరు దంపతులు వైసీపీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని సమాచారం. పాణ్యం టికెట్‌ను మరోసారి గౌరు దంపతులకు కేటాయించే విషయంలో వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పాణ్యం టికెట్ తమకు రాదనే భావనలో ఉన్న గౌరు దంపతులు... త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కర్నూలు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు ఖరారు చేస్తున్న దశలో... వైసీపీలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.