యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై కేంద్రం స్పందించాలని, సూట్ కేసు కంపెనీల గురించి కేంద్ర సంస్థలు దర్యాప్తు జరపాలని టీడీపీ విజయవాడ మధ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు ఉండవల్లి సీఎం నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వంద రోజుల్లో భారత్ కు తెప్పిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని మోదీ నేటికీ ఆ పని చేయలేదని బోండా విమర్శించారు. లండన్ లో దాచిన అవినీతి సొమ్ము, రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు, అక్కడ నుంచి ఏపీకి తరలించేందుకే జగన్ లండన్ పర్యలన చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నల్లడబ్బు తరలించుకునేందుకు ప్రధాని మోదీ సహకరిస్తున్నారని బోండా అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర సంస్థలకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బోండా వెల్లడించారు. అవినీతి డబ్బుతో వైసీపీ నేతలు దొంగ సర్వేలు చేయిస్తున్నారని, ఆ సర్వేలు అనుకూలంగా చూపి, నిధులు సేకరించుకుంటున్నారని బోండా ఉమా విమర్శించారు. ఓటమి భయంతోనే టీడీపీ సర్వేలను చంద్రగిరిలో అడ్డుకున్నారని బోండా విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు గూండాలు, రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 150 ఎమ్మెల్యే స్థానాలు, 20 పార్లమెంటు స్ధానాల్లో గెలుస్తుందని బోండా జోస్యం చెప్పారు.