యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వందశాతం ఓడిపోతారని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చంద్రబాబు ఢిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి తప్పకుండా గెలుస్తుందని జోస్యం చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపిలో పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరిగితే బాబుకేంటి బాధ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైసిపిలో చేరాలని చెబుతున్నామా? ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని.. పోటీ చేయాలో వద్దో కాంగ్రెస్సే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. తమ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. తెలంగాణలోని 16 పార్లమెంట్ స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, భాజపా రెండింటికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదన్నారు. మార్చి 1 నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సన్నాహక సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ పదవుల నియామకాలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు.