అమెరికాలో భారత-అమెరికా సంతతికి చెందిన వారు పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్, దౌత్యకార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. పుల్వామా దాడికి నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. దాడికి కారణమైన జైషే మహమ్మద్, ఆ సంస్థ నాయకుడు మసూద్ అజర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలోని ఇండో-అమెరికన్ వర్గాలు మన్‌హాటన్‌లో జరిగిన ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. వీరంతా ప్లకార్డు, భారతీయ తివర్ణ పతాకాలను చేతబట్టుకొని ఆందోళన చేపట్టారు.దీనిపై ది ఇండో అమెరికన్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ స్వెహానీ మాట్లాడుతూ ‘‘జరిగింది చాలు. దీనిని మేము క్షమించలేము.. మరచిపోలేము. పుల్వామా దాడి పాక్ ఉగ్రవాదుల శవపేటికకు చివరి మేకు కావాలి. పాక్ అర్థమయ్యే భాషలో జవాబు చెప్పాలి’’ అన్నారు. ఆందోళనలో పాల్గొన్న దాదాపు 200 మంది ‘వందే మాతరం’, ‘పాకిస్థాన్ ముర్దబాద్’, ‘పాకిస్థాన్-టెర్రరిస్ట్’ అని నినాదాలు చేశారు. ‘ ప్రపంచ ఉగ్రవాది మసూద్ అజర్‌ను అప్పగించాలి’ అని ప్లకార్డులను ప్రదర్శించారు. ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ అమెరికా శాఖ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనగుల మాట్లాడుతూ ‘‘ఈ క్రూరమైన దాడిని అమెరికా ఖండించింది. భారత్‌కు తగిన న్యాయం జరగాలి. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయాలి. మూసూద్ అజర్‌ను భారత్‌కు అప్పగించాలి. ’’ అని డిమాండ్‌చేశారు.