ఎన్నికల కోసం ఉచిత పథకాలు ప్రకటించడం సరికాదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ హితవు పలికారు. పదవుల కోసం ఎన్నికల్లో లోక్‌సత్తా పోటీ చేయదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాబోదని చెప్పారు. ఈ మేరకు విజయవాడలో లోక్‌సత్తా రాష్ట్ర సదస్సులో 2019 ఎన్నికలు- ప్రజల మేనిఫెస్టోను జేపీ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.దేశ ఐక్యత దెబ్బ తినకుండా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలని జయప్రకాశ్ నారాయణ కోరారు. స్థానిక అంశాల్లో కేంద్రం నిర్ణయం చేయనక్కర్లేదన్నారు. అధికారం జనానికి చేరువగా రావాలన్నారు. 2019 ఎన్నికల్లో చాలా మార్పులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీల తోడ్పాడు లేకుండా ఏ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెప్పారు.ఓటేస్తేనే ప్రజాస్వామ్యం కాదని, సమాజంలో ప్రతి ఒక్కరికీ సమన్యాయం అందితేనే అది ప్రజాస్వామ్యం అవుతుందని జేపీ అన్నారు. దిల్లీలో ఆప్ ప్రభుత్వం చాలా అంశాల్లో పొరపాట్లు చేసి ఉండొచ్చు.. గానీ విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టి వ్యవస్థను బాగు చేస్తోందని కితాబిచ్చారు. ఏపీలోనూ ఉచిత వైద్యం అందించొచ్చని చెప్పారు. ఉచితాలు ఇస్తేనే ప్రజల జీవితాలు మెరుగుపడవన్నారు. వాటికీ ఓ పరిమితి అంటూ ఉండాలని హితవు పలికారు. ఎన్నికల కోసం పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడమేంటని జేపీ ప్రశ్నించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధిపై ఖర్చు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎన్నికలు రాగానే తాయిలాలు ప్రకటిస్తున్నారని, వీటికి లోక్‌సత్తా విరుద్ధమని స్పష్టంచేశారు. ఉద్యమ పార్టీగా ప్రజల ముందు మా అజెండా పెడతామన్నారు.