YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విద్యార్థులెక్కడ..?

విద్యార్థులెక్కడ..?
కర్నూలు:

పది విద్యార్థుల సంఖ్య సరిపోవడం లేదు. పాఠశాల విద్యాశాఖ యుడైస్‌, చైల్డ్‌ఇన్ఫో ఆధారంగా విద్యార్థుల సంఖ్యకు, ఇటీవల ఆన్‌లైన్‌లోని ఎన్‌ఆర్‌(నామినల్‌ రోల్స్‌)కు సరిపోకపోవడం అధికారులను కలవరపెడుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు యుడైస్‌లో పదో తరగతి విద్యార్థుల వివరాలను నమోదు చేశాయి. ఇదే జాబితా ఎన్‌ఆర్‌లో వేల సంఖ్యలో విద్యార్థుల జాబితా కనిపించకపోవడం గమనార్హం. గతంలో బయటి విద్యార్థులను పరీక్షల సమయంలో ఎక్కువ డబ్బులు వసూలు చేసి రెగ్యులర్‌గా పరీక్షలు రాయించేవారు. ప్రస్తుతం పదో తరగతిలో ఆన్‌లైన్‌ సేవలు అమలు చేస్తుండడంతో అక్రమాలు బయటపడుతున్నాయని కొందరు అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలో ఈ ఏడాది నుంచి పదో తరగతి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా 916 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమానాయల పరిధిలో ఉన్నత పాఠశాలల నుంచి 50,920 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరంతా విద్యాశాఖ నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించి నామినల్‌ రోల్‌(ఎన్‌ఆర్‌)లో నమోదైనవారే. కానీ 2018-19 విద్యా సంవత్సరం యుడైస్‌ ప్రకారం అన్ని యాజమాన్యాల్లో మొత్తంగా 216 పాఠశాలల నుంచి 14,633 మందిలో ఫీజు చెల్లించి ఎన్‌ఆర్‌లో నమోదైనవారు 13,423 మంది ఉన్నారు. మిగిలిన 1,210 మంది విద్యార్థులను ఇంతవరకు చేర్చలేదు. జిల్లాలోని కోసిగి జడ్పీ 65 మంది, సోగనూరు రోడ్డు జడ్పీ 61 మంది, నంద్యాల సిద్ధిఖ్‌ ఖలీల్‌ 97 మంది విద్యార్థులు అధికంగా ఉన్నారు. ఈ విద్యార్థుల వివరాలు సేకరించాలని విద్యాశాఖ జిల్లా అధికారులకు ఆదేశాల జారీ చేసింది. ఈ ఏడాదిలో మొదటిసారిగా విద్యాశాఖ ఆన్‌లైన్‌లో విద్యార్థుల జాబితాను సేకరించింది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో విద్యాధికారులు విచారణ జరిపారు. జిల్లాలోని సర్కార్‌ బడుల్లో 11 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లగా ముగ్గురు టీసీ తీసుకెళ్లారని, ఇద్దరు డ్రాపౌట్, 9 మంది పాఠశాలకు రావడం లేదని, మరో ఇద్దరు పక్క జిల్లాకు వెళ్లారని నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది.

గతంలో నామినల్‌ రోల్స్‌ చేతిరాతతో పంపేవారు. కొన్ని తప్పిదాలతో కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడేవారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కూడా కోల్పోయేవారు. ధ్రువపత్రాల్లో తప్పులు దొర్లుతుండడంతో కొత్త విధానం అమలు చేస్తున్నారు. ఈసారి తగిన జాగ్రత్తలతో పరిశీలన చేసి ఎలాంటి తప్పిదాలు లేకుండా అన్‌లైన్‌లోనే వివరాలన్ని పంపాలని రాష్ట్ర పరీక్షల సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల జాబితాను ఎన్‌ఆర్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. నమోదుకు సంబంధించి సెక్షన్‌కు 60 మంది విద్యార్థులు దాటితే సాఫ్ట్‌వేర్‌ అనుమతి నిరాకరిస్తుండటంతో ఒకరిద్దరు విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర అందోళన వ్యక్తం చేశాయి. చేతిరాత సమయంలో నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ ఉంటే ఏదో రకంగా సర్దుబాటు చేసేవారు. ప్రస్తుతం సెక్షన్‌లో 60 మంది దాటితే పాఠశాల ఏర్పాటు, గుర్తింపు పత్రం పొందడం దగ్గరినుంచి మొత్తం ప్రక్రియకు సంబంధించి మళ్లీ విద్యాశాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియకు దాదాపు రూ.2 లక్షలు ఖర్చవడంతోపాటు చాలా సమయం పడుతుంది.

పదో తరగతిలో ఆన్‌లైన్‌ సేవలు మరింత విస్తృతపరిచేలా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంకటంగా మారాయి. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నెలవారీ నివేదికలు, స్వచ్ఛత మిషన్‌కు సంబంధించిన నివేదికలు... ఇలా అన్ని ఆన్‌లైన్‌ విధానం ద్వారానే సమాచారం సేకరిస్తోంది. పరీక్షల మార్కులను కూడా ఆన్‌లైన్‌లోనే పొందుపరుస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది నుంచి పదో తరగతి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను నమోదు చేశారు. ఈ ఏడాది నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే జారీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నామినల్‌ రోల్స్‌ మూడు విభాగాల్లో నమోదు చేశారు. మొదట విభాగంలో నమోదు చేస్తూ.. రెండో విభాగంలో విద్యార్థి వివరాలు పొందుపరచాలి. మూడో విభాగంలో ఆరు సబ్జెక్టులకు చెందిన 11 పేపర్ల వివరాలు సబ్జెక్టు కోడ్‌ను అడ్మినిస్ట్రేషన్‌ రిజిస్ట్రార్‌కు లోబడి నమోదు చేయాలి. ఒకవేళ వివరాలు తప్పుగా నమోదైతే త్వరలోనే కరెక్షన్లు చేసుకునేలా విద్యాశాఖ అవకాశం కల్పించింది.

పది విద్యార్థులకు సంబంధించి ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌ చేశారు. గతంలో కొన్ని పాఠశాలలు పదో తరగతి విద్యార్థులను అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకునేవి. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు డబ్బులు ఆశపడి అనుమతి లేని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ విద్యాలయాల్లో చదువుతున్నట్లు యుడైస్‌లో పేర్లు నమోదు చేసి పరీక్షలు రాయించేవారు. వాస్తవానికి ఏ పాఠశాలలో చదువుతున్నాడో అక్కడి వివరాలు మాత్రమే యుడైస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పట్టణ, మండల కేంద్రాల్లో ప్రైవేటు యాజమాన్యాలు ఇలాంటి పాఠశాలల పేరుతో పరీక్షలు రాయించేది. యుడైస్‌లో పొందుపరిచిన విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య మచ్చుకైనా కనిపించకపోవడం గమనార్హం. కొన్ని పాఠశాలలకు పేరుకే అనుమతులు పొందుతున్నాయి తప్ప తరగతులు నిర్వహించవు. మరికొన్నింటికి అనుమతులు ఉండవు.. కానీ దర్జాగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాటికి నామినల్‌ రోల్స్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కారణంగా అక్రమాలు బహిర్గతమవుతున్నాయని అధికారులే చెబుతున్నారు.

Related Posts